నూజివీడు: క్రీడల్లో రాణించడం ద్వారా క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఆర్డీ స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన అండర్–16 బాలబాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలు నూజివీడులో ముగిశాయి. ఈ పోటీల విజేతలకు నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నూజివీడులో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన కొనియాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులకు ఏ క్రీడపై ఆసక్తి ఉందో కోచ్లు, పీడీ, పీఈటీలు గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్. రామదాసు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
పోటీల విజేతలు
బాలికల విభాగం: శ్రీకాకుళం (ప్రథమ స్థానం), కర్నూలు (ద్వితీయ స్థానం), చిత్తూరు (తృతీయ స్థానం).
బాలుర విభాగం: బాపట్ల (ప్రథమ స్థానం), నెల్లూరు (ద్వితీయ స్థానం), తిరుపతి (తృతీయ స్థానం).
మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్


