వేటపాలెం: ఆర్థిక ఇబ్బందులతో మరణించిన కానిస్టేబుల్ లేళ్ల వీరన్న కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం దేశాయిపేట పంచాయతీ రామనగర్ గల కానిస్టేబుల్ స్వగృహానికి వచ్చిన ఎస్పీ వీరన్న పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీరన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ వీరన్న ఆదివారం మృతి చెందాడు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని వీరన్న సతీమణి నాగమణికి ఎస్పీ అందజేశారు. అనంతరం పోలీస్ శాఖ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీరన్న మృతి పట్ల జిల్లా పోలీస్ అధికారులు, సహోద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ నారాయణ, చీరాల రూరల్ సీఐ సుధాకర్, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, ఎస్సై పి జనార్దన్ పాల్గొన్నారు.
ఎస్పీ ఉమామహేశ్వర్


