బాపట్లటౌన్: సూర్యలంక సముద్ర తీరానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో తీరం సందడిగా మారింది. దసరా సెలవులకు తోడు ఆదివారం కావడంతో పర్యాటకులు ఎక్కువగా వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచే తీరానికి పర్యాటకుల రాక మొదలైంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించే మహిళలు తొలుత ఉదయాన్నే తీరానికి చేరుకుని సూర్యనమస్కారాలతో కూడిన పుణ్యస్నానాలు ఆచరించారు. తీరం వెంబడి ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు, చిన్నారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్నానాలు చేస్తూ, తీరం వెంబడి కేరింతలు కొడుతూ గడిపారు. పర్యాటకుల రాకను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యాటకులను అప్రమత్తం చేస్తూ పహారా కాశారు.


