గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ిసీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆదివారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సున్నిత, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు అన్ని పోలింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది శిక్షణ, పోలింగ్ సామగ్రి సమకూర్చడం, వెబ్ కాస్టింగ్, పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి అంశంపై స్పష్టత ఉండాలని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనల మేరకు అధికారులు ప్రతి పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో షేక్ ఖాజా వలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


