ఏపీ హామ్‌ ఫెస్ట్‌ పోస్టర్లు ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఏపీ హామ్‌ ఫెస్ట్‌ పోస్టర్లు ఆవిష్కరణ

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: అమరావతిరోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాల వేదికగా నవంబర్‌ 15న నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ హామ్‌ ఫెస్ట్‌– 2026 పోస్టర్లను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ హామ్‌ ఫెస్ట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కాకాని పృథ్వీరాజు, కమిటీ సభ్యులు ఏవీ రమణమూర్తి, బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కార్యక్రమ లక్ష్యాలు, హామ్‌ రేడియో ప్రాముఖ్యతను వివరించారు. హామ్‌ రేడియో అభివృద్ధి, ప్రచారానికి సంబంధించి హామ్‌ రేడియో ఔత్సాహికులు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, రేడియో ఆపరేటర్లందరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ప్రజ్ఞాచారికి మహాత్మాగాంధీ నేషనల్‌ పీస్‌ అవార్డు ప్రదానం

తెనాలిటౌన్‌: సాహితీ రత్న డాక్టర్‌ నూతక్కి పూర్ణప్రజ్ఞాచారి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. రూరల్‌ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీరత్న నూతక్కి పూర్ణప్రజ్ఞాచారికి మహాత్మా గాంధీ నేషనల్‌ పీస్‌ అవార్డ్‌ లభించింది. మార్కాపురం జిల్లా గ్లోబల్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ వారు మహాత్మా గాంధీ జయంతి వారోత్సవాల్లో భాగంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన సాహితీ మూర్తులకు ఆదివారం ప్రదానం చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గొట్టుముక్కల చెన్నకేశవులు, ముఖ్య అతిథి తెలంగాణ హైకోర్టు సూపరింటెండెంట్‌ పి. వి.అంజని కుమారి, దిశ ఫాండేషన్‌ చైర్మన్‌ జక్కంరెడ్డి సుబ్బాయమ్మ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగ టీచర్‌ నారాయణరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ బీసీ వెల్ఫేర్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నారాయణస్వామిలు పూర్ణ ప్రజ్ఞాచారికి అవార్డు అందజేశారు.

అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం?

చీరాల: పట్టణంలోని జయంతిపేటలోని ఇంట్లో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్నారంటూ స్థానికులు గమనించి తెనాలికి చెందిన వ్యక్తులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆదివారం తెల్లవారుఝామున ఒక ఇంట్లో క్షుద్రపూజలు తరహాలో పూజలు జరుగుతుండటంతో స్థానికులు గమనించి ఇంటి తలుపులు తెరిచారు. ఇంట్లో పెద్ద ముగ్గులు వేసి పూజలు చేయడం గమనించారు. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు పట్టుకున్న వ్యక్తులు తెనాలికి చెందిన వారిగా గుర్తించారు. ఇంటి యజమాని రాజేష్‌ నుంచి పోలీసులు వివరాలను నమోదు చేశారు. క్షుద్రపూజలు చేసిన దాఖలాలు లేకపోవడంతో స్థానికులు, ఇంటి యజమానిని పిలిపించి వివరాలను నమోదు చేసి పంపించి వేశారు.

స్థానిక ఎన్నికల్లో అల్లర్లు

సృష్టిస్తే కఠిన చర్యలు

నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌స్టేషన్లల్లో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌ను సీఐలు, ఎస్‌ఐలు చేపట్టారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే సహించేదిలేదని పోలీస్‌ అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా వివాదాలకు వెళ్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని స్పష్టం చేశారు. గతంలో చేసిన నేరాలు మళ్లీ చేయవద్దని సూచించారు. బాధ్యత గల పౌరులుగా జీవించాలని చెప్పారు. కుటుంబ సభ్యుల భవిష్యత్‌ను తెలుసుకుని ప్రవర్తించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు. జిల్లాలోని రౌడీషీటర్లు, నేర ప్రవృత్తి ఉన్న వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రౌడీషీటర్లు ఎటువంటి నేరాలకు వెళ్లకుండా ముందస్తు బైండోవర్లు చేస్తున్నట్లు తెలిపారు.

వాహనం అదుపు తప్పి

యువకుడు మృతి

మాచర్ల: శ్రీశైలం–మాచర్ల హైవే నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఎం.ఫణీంద్రరెడ్డి (31) పట్టణంలోని రింగ్‌ రోడ్డు సెంటర్‌ వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో రింగ్‌ రోడ్డు సెంటర్‌ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫణింద్రరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. ఘటనపై పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. యువకుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement