సంపులో పడి కార్మికుడి మృతి
మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల కై లాసగిరిలో ఉన్న బయో డీజిల్ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. కంపెనీలో కెమికల్ అనాలసిస్ ల్యాబ్ వర్కర్‌గా పనిచేస్తున్న పోపూరి యశ్వంత్ (33) విధుల్లో ఉన్న సమయంలో బాత్రూంకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు సంపులో పడటంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో మృతుడి బంధువులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చి, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డీజిల్ దొంగల ముఠా అరెస్ట్
మంగళగిరి రూరల్: రాజధాని ప్రాంతంలో నిర్మాణ యంత్రాలు, నిలిపి ఉంచిన లారీల నుంచి సుమారు 500 లీటర్ల డీజిల్ చోరీ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులు ఉయ్యూరు ఉమామహేశ్వర్‌రెడ్డి (నిడమర్రు), మేకల రాజు (నవులూరు), పంతంగాని శీను (ఇబ్రహీంపట్నం)గా గుర్తించారు. నిడమర్రు నుంచి తాడికొండ వెళ్లే రహదారిలోని ఓ షెడ్‌లో డీజిల్ లోడింగ్, అన్‌న్‌లోడింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.
కాలువలోకి దూసుకెళ్లిన వాహనం
తాడికొండ: కారును ఓవర్‌టేక్ చేస్తూ వాహనం అదుపు తప్పడంతో కాల్వలోకి దూసుకెళ్లిన ఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అతివేగంగా వస్తున్న వాహనం కారును ఓవర్ టేక్ చేయబోయే సమయంలో అదుపుతప్పి మధ్య రోడ్డు నుంచి నది వైపు రోడ్డులోకి డివైడర్ దాటుకొని వెళ్లింది. అనంతరం పక్కనే డ్రైనేజీ కోసం తీసిన కాలువలో పడింది ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా ఆదివారం కావడంతో రోడ్డు నిర్మానుష్యంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.


