తూతూమంత్రంగా విచారణ ఆర్పీలను బలిచేసి.. పై స్థాయి సిబ్బందిని కాపాడే ప్రయత్నం
నెహ్రూనగర్: జిల్లా మెప్మా విభాగంలో అక్రమార్కుల దోపిడీ పర్వం యథేచ్ఛగా సాగుతోంది. పేద మహిళల పొదుపు సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. అధికారుల అండదండలతో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. తాజాగా గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ డ్వాక్రా గ్రూపు సభ్యులు బ్యాంకు రుణం కింద చెల్లించాల్సిన వాయిదాల మొత్తాన్ని రిసోర్స్ పర్సన్(ఆర్పీ)కి అప్పగించారు. అయితే, ఆర్పీతో పాటు కమ్యూనిటీ ఆర్గనైజర్(సీఓ) కుమ్మకై ్క ఆ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా దర్జాగా స్వాహా చేశారు. బాధితులు ఈ విషయాన్ని గుర్తించి ఆర్పీని నిలదీశారు. అధికారుల నుంచి సరైన న్యాయం జరగకపోగా, తీవ్ర ఒత్తిళ్లకు లోనైన సదరు గ్రూప్ లీడర్ మనస్తాపంతో కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీనిపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌న్‌లో కేసు నమోదైంది.
అంతా ‘మేనేజ్’ డ్రామా!
ఈ ఘటనపై విచారణ జరిపించాల్సింది పోయి, కేసును నీరుగార్చేందుకు మెప్మా ఉన్నతాధికారులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. విచారణ బాధ్యతలను మళ్లీ మెప్మా సిబ్బందికే అప్పగించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెప్మాలో ఏ అవినీతి బాగోతం బయటపడినా ‘డిపార్ట్‌మెంట్ ఎంకై ్వరీ’ పేరుతో కాలయాపన చేయడం ఇక్కడ రివాజుగా మారిందనే విమర్శలు లేకపోలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే.. విచారణ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండే ఆర్పీలపై నెపం నెట్టేసి, వారికి సహకరించిన సీఓలు, పైస్థాయి అధికారులకు క్లీన్‌న్ చిట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బలిపశువులుగా మారిన ఆర్పీలను కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు నటించి, ఆ తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ) కార్యాలయంలో భారీ ఎత్తున ‘ముడుపులు’ చేతులు మారాక మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ’తమ వారు’ అనుకుంటే చాలు.. కనీసం విధులకు హాజరుకాకపోయినా ప్రతి నెలా ఠంచనుగా జీతాలు జమ చేస్తున్నారని ఇతర సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోన్ల గోల్‌మాల్‌పై నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సీఎంఎం మాధవరావును వివరణ కోరగా గ్రూపు సభ్యులకు, ఆర్పీ మధ్య ఉన్న పర్సనల్ గొడవల వలన విషయం బయటకు వచ్చింది. గ్రూపు రెగ్యులర్‌గానే ఉంది. దీనిపై సోమవారం విచారణ చేపట్టి సమగ్ర నివేదికను అందజేస్తాం.


