రాష్ట్రాభివృద్ధిలో విద్యకు కీలక పాత్ర | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధిలో విద్యకు కీలక పాత్ర

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో విద్యాభివృద్ధి కీలకమని, దశాబ్దాల చరిత్ర కలిగిన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెరుగుదలకు మరింత బాధ్యతగా విద్యా బోధన చేయాలని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. వీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గురుకుల ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ సభను అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఒక సమాజం, ఒక వ్యవస్థ, ఒక దేశం అభివృద్ధి పథాన నడవాలంటే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువుల పైనే ఉన్నదన్నారు. పార్లమెంట్‌ సభ్యునిగా తనకొచ్చే నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసమే ఖర్చు చేసేలా సంకల్పించానని అన్నారు. ఎనిమిదేళ్లుగా వీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ప్రతి యేటా గురుకుల పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు గురుకుల పాఠశాలలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్‌ పీవీ మల్లేశ్వర్‌ మాట్లాడుతూ తమ మిత్రులు వినుకొండ శ్రీనివాసరావు స్ఫూర్తితో వీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌, కృతి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురుకుల ఉపాధ్యాయులను సత్కరించటంతోపాటు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, నూతన వస్త్రాలు అందించటంతో పాటు విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ గౌరవాధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు ఉత్తమ విద్యాసంస్థలకు మారుపేరుగా ఉన్నాయన్నారు. ఎందరో సీనియర్‌ ఐఏఎస్‌లు గురుకుల విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన వారేనని చెప్పారు. ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవం గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించే బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బి.వందనాదేవి, డాక్టర్‌ హిమబిందు కొండలరావు, గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్‌, రాఘవ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement