పోషకాహార సాగును ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రథం బజార్‌లోని శ్రీమత్సందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీక్షీర భవనారాయణస్వామి దేవస్థానం ఎదురు అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భక్తులకు ప్రతిమలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా నదులు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరులు కాలుష్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు, రసాయనిక రంగుల వినియోగం వల్ల నిమజ్జనం అనంతరం నీటి వనరులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సతీసమేతంగా సందర్శించారు. వారికి వేద పండితులు స్వాగతం పలికారు. దేవాలయంలో కొలువైన వివిధ దేవతామూర్తులను దర్శించారు. భవనారాయణస్వామి వారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, గోత్రనామాలతో పూజలు జరిపించారు. కలెక్టర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు, దైవ ప్రసాదం అందించారు. ఆలయానికి అవసరమైన మౌలిక వసతులు, సమస్యలపై కలెక్టర్ వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ సలీమా, జిల్లా అఖండ ఫౌండేషన్ చైర్మన్ విన్నకోట సురేష్, దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ దేశిరాజు వెంకటరమణబాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో వసతులకు చర్యలు
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసుతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో పాఠశాలల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో డ్రాప్ అవుట్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. హాజరు తక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఎస్‌జీఎస్‌డబ్ల్యూ కోఆర్డినేటర్ యశ్వంత్‌ను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక నివేదికలు సకాలంలో సమర్పించాలి
కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నివేదికల సమర్పణలో పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికల సమర్పణలో జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ ప్రగతి ఉన్న శాఖలు వచ్చే నెల నాటికి మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపుతోపాటు పోషకాలు కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సాంకేతికత, నిర్వహణ పద్ధతులు తెలిపి ఆదాయాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి లక్ష్మి, పశు సంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, ఉద్యాన శాఖ అధికారి ఖలీం తదితరులు పాల్గొన్నారు.


