మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజా సామాగ్రితో హాజరై అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ
మంగళగిరి టౌన్: నేటి యువతరం క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఐజీపీ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌లో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చి ఎనిమిది పతకాలు సాధించానని తెలిపారు. టేబుల్ టెన్నిస్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌లో పతకాలు సాధించి ఆల్‌రౌండర్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈగల్ టీం టేబుల్ టెన్నిస్‌లో 40 ఫ్లస్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాలు, 50 ఫ్లస్ సింగిల్స్, 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజత పతకం, షటిల్ బ్యాడ్మింటన్‌లో 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్‌లో స్వర్ణం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం, స్విమ్మింగ్‌లో 25 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. ఈగల్ విభాగం మొత్తంగా 40 పతకాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం – తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.
మచిలీపట్నం – తిరుచానూరు (07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారు జామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతాయి.


