యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్న టీడీపీ నేతలు రాత్రికి రాత్రే సొన పూడ్చి ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు కనీసం కన్నెత్తి కూడా చూడని రెవెన్యూ అధికారులు
వేటపాలెం: అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి జేబులు నింపుకొంటున్నారు. దొరికినకాడికి స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నం శివారులో నాయినపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 9లో సొన పోరంబోకు భూముల ఆక్రమణలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతూ, నీటి వనరుగా ఉన్న సొనలను స్థానికంగా ఉన్న కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఆక్రమించడం దారుణమని పేర్కొంటున్నారు.
అడ్డగోలుగా పూడ్చివేసి...
ఈ భూముల్లో రాత్రికి రాత్రే పొక్లెయిన్‌లతో సొనను పూడ్చివేసి ఇళ్ల ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అసైన్డ్, శ్మశాన భూములను కూడా వదలడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణలపై పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పకీ మండల అధికారులు కేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా నివేదికలు సమర్పిస్తున్నారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకొంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఆక్రమణదారులకు సహకరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. కుందేరు సొన పోరంబోకు ప్రాంతంలో మట్టి పూడ్చివేతపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భూమి హక్కులు, రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.


