మోంథా తుపానుకు జిల్లాలో 6,062.21 ఎకరాల్లో పంట నష్టం 33 శాతం కన్నా ఎక్కువగా నష్టపోతే ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం రూ.5.75 కోట్ల కోసం 3,800 మంది రైతుల ఎదురుచూపులు ఖరీఫ్ రుణాల కోసం వడ్డీ వ్యాపారులే దిక్కని అన్నదాతల ఆవేదన
పరిహారం వెంటనే ఇవ్వాలి
ప్రభుత్వం నుంచి స్పందన కరువు..
రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతున్న చంద్రబాబు సర్కారు... వారిని ఆదుకోవడంలో విఫలమైంది. గత అక్టోబర్ నెలలో సంభవించిన మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడు నెలలైనా బాధిత రైతులకు బాసటగా నిలవడానికి బాధపడుతోంది. అది తమ బాధ్యత కానట్టుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొరిటెపాడు (గుంటూరు): గత ఏడాది అక్టోబర్ మాసంలో మోంథా తుపాను ధాటికి నష్టపోయిన వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సర్వే అనంతరం నివేదిక రూపొందించారు. దానిని ప్రభుత్వానికి పంపారు. సుమారు ఏడు నెలలు కావస్తున్నా ఇంత వరకు నష్ట పరిహారం మంజూరు చేయలేదు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తే అప్పుల నుంచి బయటపడతామని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. మోంథా తుపాను ధాటికి జిల్లాలో సాగు చేసిన వరి, పత్తి, మినుము, కంది, సోయాబీన్ వంటి పంటలతోపాటు అరటి, కూరగాయలు, తమలపాకు, పువ్వులు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సర్వే చేసి పంట నష్టాన్ని గుర్తించారు.
ప్రతి ఏడాది ఇవే అవస్థలు
ఏటా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. అకాల వర్షాలు, తుపానుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటలను విక్రయించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తుపాను పరిహారం వస్తే కొంత మేర నష్టం భర్తీ అవుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. ఏడు నెలలు పూర్తవుతున్నా ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదు. కనీసం ఆ దిశగా చర్యలేవీ తీసుకోకపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి గడ్డు పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆదుకోకుంటే ఎలా అని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది అక్టోబర్ మాసంలో సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో తుపాన్ దెబ్బతీయడంతో రైతులకు కన్నీరే మిగిలింది. జిల్లాలో వరి 2,693.20, పత్తి 1,282.50, మినుము 1,243.55, సోయాబీన్ 234.61, కంది 10.02 ఎకరాల్లో సాగు చేశారు. అరటి 450.61, కూరగాయలు 123.27, తమలపాకులు 24.43, పువ్వులు 0.60 ఎకరాలలో నష్టపోయినట్లు గుర్తించారు. జిల్లాలో 3,800 మంది రైతులు సుమారు రూ.5,75 కోట్లు నష్టపరిహారం అందుకునేందుకు అర్హులుగా గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి పంపారు. నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం పైసా దక్కలేదు. ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో...
నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రకృతి అనుకూలించకపోయినా, వర్షాలు పడి పంటలకు నష్టం జరిగినా, వర్షాలు లేక పంటలు ఎండిపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడే పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడకుండా, పెట్టుబడుల కోసం ఇతరులను ఆశ్రయించకుండా వ్యవసాయం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఎటు నుంచి ఎటు చూసినా చంద్రబాబు ప్రభుత్వం వల్ల రైతులకు నష్టం తప్పడం లేదు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. ఖరీఫ్, రబీ సమయాల్లో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు కోసం అవసరమయ్యే ఖర్చుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ చివరిలో వచ్చిన మోంథా తుపాను తాకిడికి జిల్లా వ్యాప్తంగా సాగైన పంటలు దెబ్బతిన్నాయి. ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.
– కంచుమాటి అజయ్‌కుమార్,
జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం


