నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో టోర్నమెంట్‌లో కృష్ణవేణి కళాశాల జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్‌లో తమ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించటంతోపాటు జట్టులోని పి.గోపినాథ్, బి.దిలీప్, ఎన్.అనిల్, పి.వెంకట్రావు, ఎం.యూష్‌లు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న సౌత్‌జోన్ ఖోఖో పోటీల్లో ఏఎన్‌యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జట్టు విజయానికి కృషి చేసిన వ్యాయామ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ప్రిన్సిపల్ నాతాని, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, అధ్యాపకులు ఎం.తిరుపతిరావు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షునిగా వెలుగూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా కోట శివకృష్ణ, కోశాధికారిగా కొలిపాకుల లక్ష్మీకాంత్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా చిట్టెపు శ్రీధర్‌రెడ్డి నియమితులయ్యారు. నూతన కార్యవర్గం సభ్యుల చేత జిల్లా అధ్యక్షులు చక్కా సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. సభలో నూతన అధ్యక్షులు కృష్ణ్ణమూర్తి మాట్లాడుతూ నూతన సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. కార్యదర్శి శివకృష్ణ్ణ మాట్లాడుతూ వ్యాపార ధోరణే కాకుండా సమాజం పట్ల తమ వంతు బాధ్యతగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. మాస్టర్ ప్రింటర్స్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శి నేతగాని ఫిలిప్స్ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు తోట శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఆదివారం బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు, తాజా నియమాలు, మార్గదర్శకాలు, ఆడిట్‌లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలపై అవగాహన కల్పించారు. అనంతరం బ్రాంచ్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్ బ్యాంకు శాఖల ఆడిట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్ దోహదం చేస్తుందన్నారు. వర్క్‌షాప్‌లో ఐసీఏఐ గుంటూరుశాఖ వైస్ చైర్మన్ వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శి కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాధికారి నాగబీరు రాజశేఖర్, సి కా సా చైర్మన్ షేక్ బాజీ, కమిటీ సభ్యులు దేసు సంపత్ , చింతా రఘు నందన్, సీఏలు పాల్గొన్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు డాక్టర్ గద్దె రాజేంద్రప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు.


