చిలకలూరిపేటటౌన్: బైక్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన పిల్లి దొరకరాజు (38) ఆదివారం తెల్లవారుజామున వ్యక్తిగత పనులపై చిలకలూరిపేట వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామం దాటిన తర్వాత, బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఎండిపోయిన పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు తలకు బలమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
అమరావతి: విజయవాడ నుంచి అమరావతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అమరావతి గ్రామ సమీపంలో ఒక్కసారిగా ముందు టైరు పేలి రోడ్డు పక్కన కందకంలో దిగబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అమరావతికి వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని పెదమద్దూరు దాటి అమరావతి సమీపానికి రాగానే ఒక్కసారిగా ముందుటైరు పేలింది. ఈక్రమంలో బస్సు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూసుకు వెళ్లి దిగబడి పూర్తిగా ఒకపక్కకి ఒరిగి పోయింది. ఈసమయంలో బస్సులో ఉన్న ఇరవై మంది ప్రయాణీకులు, డ్రైవర్, కండక్టర్‌లు ఎలాగోలా బస్సునుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు నాగవర్ధిని, శివపార్వతి, రమాదేవిలకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అందరు ఊపిరిపీల్చుకున్నారు.
అమరావతి: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ కేంద్రం గుంటూరు ఆధ్వర్యంలో అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో త్రిపుర రాష్ట్రం నుంచి యువతీయువకులు క్షేత్ర దర్శనంలో భాగంగా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని, ధ్యాన బుద్ధ విగ్రహాన్ని, పురావస్తు మ్యూజియాన్ని దర్శించారు. త్రిపుర రాష్టానికి చెందిన 37 మంది యువతీయువకులు పాల్గొన్నారు. మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు, విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో తుళ్ళూరి సాంబశివరావు బెజ్జం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


