మా ఫ్లెక్సీని తొలగిస్తాం ..
వచ్చాక అన్నిటినీ తొలగిస్తాం
కలెక్టర్ మాటకు విలువ లేదా!
● చీరాల వైఎస్సార్ సర్కిల్‌లో ఫ్లెక్సీల తొలగింపులో లోపించిన పారదర్శకత ● రాజకీయ ఒత్తిడా .. స్వయం నిర్ణయమా అంటున్న ప్రజలు
చీరాల అర్బన్: స్థానిక గడియార స్తంభం సెంటర్లోని వైఎస్సార్ సర్కిల్లోని ఫ్లెక్సీల విషయంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. పక్షపాతం చూపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కలెక్టర్ ఏం చెప్పారు. పోలీసులు ఏం చేశారు. పోలీసుల చర్యలకు రాజకీయ ఒత్తిడి కారణమా, లేకుంటే వారి స్వయం నిర్ణయమేనా, ఇది దేనికి సంకేతమని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి చర్యలతోనే పోలీస్ శాఖ మసక బారుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టకూడదని హెచ్చరిక బోర్డు ఉన్నా, దాన్ని అతిక్రమించడంతో మున్సిపాల్టీకి ఆదాయం లేకపోగా అప్రతిష్ట మూటగట్టుకున్నట్లు అవుతుందని ప్రజలు అంటున్నారు. దీన్ని బట్టి ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ తమ బాస్‌లకు ఏం నివేదకలు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
కలెక్టర్ ఏం చెప్పారు...పోలీసులు ఏం చేశారు?
● గత సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ వి.వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు యాతం మేరీబాబు, బొనిగల జైసన్‌బాబు తదితరులు కలెక్టర్‌ను కలిశారు. గడియార స్తంభం సెంటర్లోని వైఎస్సార్ సర్కిల్లో రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని రాత పూర్వకంగా కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న డీఎస్పీ మొయిన్‌కు అక్కడే కాదు, విగ్రహాల వద్ద ఎక్కడ ఫ్లెక్సీలు ఉన్నా తొలగించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా సదరు సర్కిల్లో ఉన్న పోలీస్ శాఖ పరంగా వాహన చోదకులకు ప్రయాణ భద్రతపై అవగాహన కల్పించే ఫ్లెక్సీని మాత్రమే పోలీసులు తొలగించారు. మిగిలిన ఫ్లెక్సీలను అలానే ఉన్నాయి.
ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
● వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలిరాగా ఆరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజవకర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్‌బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సందర్భంగా సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాారు. ముందస్తుగా మున్సిపల్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్నారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా హుందాగా వ్యవహరించారు. కేక్ కట్ చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తరువాత ఏం జరిగింది?
● ఈ క్రమంలో సర్కిల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. మళ్లీ పోలీస్‌శాఖ పరంగా అంతకు ముందున్న ఫ్లెక్సీని అక్కడ తిరిగి పెట్టారు. వాస్తవానికి పోలీస్‌శాఖ పరంగా వాహన చోదకులు తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ అంశం. అయితే మిగిలిన ఫ్లెక్సీలతో పాటు ఉండటం విమర్శలకు తావిస్తోంది. సర్కిల్లో ఉన్న టీడీపీ ఫ్లెక్సీ అలానే ఉంది. మరో ఒకటి, రెండు ఫ్లెక్సీలు కూడా అలానే ఉన్నాయి. ఇది పక్షపాతం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ సర్కిల్లో ఫ్లెక్సీలు తొలగించాలని కలెక్టర్ చెప్పిన విషయం నాకు తెలీదు. పోలీస్ పరంగా రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం వాహన చోదకులు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాం. వాటికి సంబంధించి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది వివాదాస్పదం అనుకుంటే మా ఫ్లెక్సీని తొలగిస్తాం. మిగిలిన ఫ్లెక్సీలను తొలగించాల్సిన బాధ్యత మాది కాదు మున్సిపాలిటీది. వాటిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదే.
– సుబ్బారావు, వన్‌టౌన్ సీఐ, చీరాల
ప్రస్తుతం నేను వైజాగ్‌లో జరుగుతున్న వర్క్‌షాప్‌లో ఉన్నా. వాస్తవానికి మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. కొన్ని చోట్ల రుసుం కూడా చెల్లిస్తారు. అది నిర్ణీత కాలం మాత్రమే. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామంటే పోలీస్‌కు అనుమతి ఇచ్చాం. వైఎస్సార్ సీపీ వారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు, కార్యక్రమం అనంతరం తీసేవిధంగా అనుమతి ఇచ్చాం. డీఎస్పీతో మాట్లాడి నేను దగ్గరుంచి అన్ని ఫ్లెక్సీలను తొలగించే విధంగా చర్యలు చేపడతాను. ఆరోగ్య కరమైన వాతావరణం కల్పిస్తాం.
– డానియల్ జోసెఫ్,
మున్సిపల్ కమిషనర్, చీరాల
కలెక్టర్ అంటే జిల్లాకు ముఖ్య అధికారి. జిల్లా న్యాయాధికారి హోదా. పరిపాలన పరంగా నిర్ణయాధికారి. అలాంటి కలెక్టర్ ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేయటంతో కలెక్టర్ మాటకు విలువ లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఎవరి మాటను వారు ఖాతరు చేస్తారనే కోణంలో మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా మున్సిపల్ పరిధిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి. అలానే కొన్ని సందర్భాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలకు, హోర్డింగ్‌లకు సంబంధించి అనుమతి పొందిన ఏజెన్సీల ద్వారా, లేదా నేరుగా ఏర్పాటు చేస్తారు. అందుకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. అయితే వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ కోవకు చెందినవి కావు. దీంతో మున్సిపాలిటీకి అప్రతిష్ట తప్ప, ఇలాంటి చర్యల వల్ల ఆదాయం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని హెచ్చరిక బోర్డు ఉండటం అందుకు కారణం.


