రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువు
రాక్షస పాలన, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది వెంటనే రాష్ట్రపతి పాలన అమలు చేయాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి
చెరుకుపల్లి: రాష్ట్రంలో సామాన్యుడి నుంచి రాష్ట్ర మాజీ మంత్రుల వరకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని... రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాగం నడుస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గుళ్ళపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పీటా నాగ మోహన్ కృష్ణ వ్యక్తిగత కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన 20 నెలలుగా రాష్ట్రంలో రాక్షస రాజ్యం, అరాచక పాలన రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి అన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసేందుకు టీడీపీ గూండాలు వచ్చి ఆయన ఇంటిని, కార్లను ధ్వంసం చేశారన్నారు. ఆదివారం మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారన్నారు. ఈ సంఘటనలకు ముందు మాజీ మంత్రి విడదల రజినిపై, మాజీ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిపై, మరికొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. వారి అరాచకాలు దుర్మార్గం అన్నారు. ఈ దురాగతాన్ని పోలీసులు చూస్తూన్నారేగానీ నిలువరించటానికి చర్యలు తీసుకోకపోవటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్టాన్ని వల్లకాడు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక, ప్రజలకు మంచి పాలన అందించడం చేతగాక ఈ దురాగతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చేతగాని పరిపాలన చేస్తున్న చంద్రబాబు పాలనలో తప్పులను ప్రశ్నించే అమాయక ప్రజలపై తప్పుడు కేసులు మోపటం, దాడులకు దిగటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని నీచ రాజకీయాలు చేసిన పాపపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వివరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్‌ను కోరతామని పేర్కొన్నారు. ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం, కేంద్ర హోం శాఖ చొరవ తీసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్ మోహన్, ఆరుంబాక సర్పంచ్ కామినేని కోటేశ్వరరావు, లుక్కా బాపనయ్య, వంగరు భాను, శారద, సుభాని రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


