సందర్శించిన జిల్లా కలెక్టర్
పురాతన ఆలయాలను
కుటుంబ సభ్యులతో ఆటవిడుపుగా సందర్శన
చినగంజాం: మండలంలోని మోటుపల్లి పురాతన దేవాలయాలను జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. గ్రామంలోని కాకతీయుల కాలంనాటి గణపతి దేవుడు, రుద్రమదేవి పాలనలో నిర్మాణం చేసుకున్న పురాతన వీరభద్ర స్వామి దేవాలయం, సీతారామాలయాలను ఆయన సందర్శించారు. ఆలయంలోని స్తంభాలు, గోడలపై ఉన్న శిలాఫలకాలను, చోళుల నాటి శాసనాలను, ప్రాకృతాలను ఆయన పరిశీలించారు. ఆలయంలో పురాతన శిలలన్నింటిని ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆలయంలోనికి తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కే ధనలక్ష్మిని ఆదేశించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఒంగోలు ఆర్కియాలజీ శాఖకు చెందిన యశ్వంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఆలయంలోని పురాతన విగ్రహాలను, విరిగిపోయిన శాసనాలు, విగ్రహాలను తెప్పించి మ్యూజియంలా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కలెక్టర్ వివరించినట్లు సమాచారం. అనంతరం పురావస్తు శాసనాలపై పూర్తి అనుభవం కలిగిన అద్దంకి చెందిన జ్యోతి చంద్రమౌళితో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. ఆలయానికి సంబంధించి చరిత్ర వివరాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని పురాతన విగ్రహాలను, వస్తువులను సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చి తెప్పించాల్సిందిగా ఎంపీడీవోకు సూచించారు. అనంతరం ఆయన మోటుపల్లి తీరంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత సేపు సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కే ధనలక్ష్మి, వీఆర్వో దానియేలు, గ్రామ సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు, మాజీ సర్పంచ్ వడ్లమూడి సత్యం , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సందర్శించిన జిల్లా కలెక్టర్


