29 నుంచి వ్యవసాయంపై గుంటూరులో సదస్సు
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుంచి వ్యవసాయ ప్రదర్శన, వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. నాలుగు రోజులు పాటు 14 అంశాలపై సదస్సులు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా
నరసరావుపేట: జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి చెందిన బ్రోచర్‌ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కాలనీలు, విద్యాలయాలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లెప్రసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి, డెప్యూటీ జిల్లా కుష్ఠు, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
రొంపిచర్ల: మేజర్ కాలువలో పడి లస్కర్ మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని మాచవరం మేజర్ వద్ద చోటుచేసుకుంది. సంతగుడిపాడు గ్రామానికి చెందిన ఎనుముల శ్రీనివాసరెడి (55) ఎన్‌ఎస్‌పీ కెనాల్స్‌లో లస్కర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా మాచవరం మేజర్ కాలువపై డ్రాప్ వద్ద సాగునీటిని లెవల్స్ పరిశీలిస్తున్నాడు. ఇంతలో తూలుడు వచ్చి కాలువలో పడిపోయాడు. నీటిలో మునిగిన శ్రీనివాసరెడ్డి బయటకు రాలేకపోయాడు. అక్కడే సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంటనే శ్రీనివాసరెడ్డిని కాలువ నుంచి బయటకు తీసి నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అమరావతి: రైతుల అంగీకారం లేకుండా భూసమీకరణకు భూములు తీసుకోకూడదని జిల్లా సీపీఎం కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 33 వేల ఎకరాలు భూసమీకరణ చేసి ఇంతవరకు రైతులకు లేఅవుట్‌లలో ప్లాట్‌లుగాని, మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం దారుణమన్నారు. మొదట విడత రాజధాని అమరావతి రైతులకు న్యాయం చేసిన తర్వాత మిగిలిన భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రూరల్ కార్యదర్శి సయ్యద్ మోహీద్దీన్‌వలి నండూరి వెంకటేశ్వరరాజు అమరావతి శాఖ కార్యదర్శి బి.సూరిబాబు పాల్గొన్నారు.
గుణదల(విజయవాడ తూర్పు): కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో ప్రాంతీయ కార్మిక సదస్సు మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖామంత్రి వాసంశెట్టి శుభాష్ మాట్లాడుతూ గోవా, జైపూర్ రాష్ట్రాల తర్వాత కార్మిక సదస్సు విజయవాడలో జరగటం మనకు గర్వకారణమన్నారు. అనంతరం కార్మిక చట్టాలపై చర్చించారు.
29 నుంచి వ్యవసాయంపై గుంటూరులో సదస్సు
29 నుంచి వ్యవసాయంపై గుంటూరులో సదస్సు


