హౌసింగ్ లే అవుట్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: జిల్లాలోని హౌసింగ్ లేఅవుట్స్‌లో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి హౌసింగ్ లేఅవుట్స్, పీఎంఎవై ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్‌లో ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటుకు సంబంధిత అధికారులు వెంటనే ప్రతిపాదనలు అందించాలన్నారు. గతంలో వివిధ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వినియోగించిన నిధుల వివరాలను అందించాలన్నారు. లే అవుట్స్ వారీగా లబ్ధిదారులకు కేటాయించినవి, కేటాయించిన వాటిలో నిర్మాణాలు ప్రారంభించినవి, పూర్తి అయినవి, కేటాయించకుండా ఖాళీగా ఉన్న ప్లాట్‌ల వివరాలను మ్యాప్‌లతో సహా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆప్షన్–3లో నిర్మించిన ఇళ్లలో స్టేజ్, క్వాలిటీ డివియేషనన్స్‌ను కాంట్రాక్టర్లతో వెంటనే సరిచేసేలా హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఖాజావలి, తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో కె.శ్రీనివాసులు, తెనాలి కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు పాల్గొన్నారు.


