మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు
చెరుకుపల్లి: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అనంతరం రైతు సేవ కేంద్రంలో గోనె సంచులు, టార్పాలిన్ పట్టల అందుబాటుపై ఆరా తీశారు. మండల వ్యవసాయ అధికారి ఫరూఖ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చెరుకుపల్లి మండలంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తేమ శాతాన్ని పరీక్షించి బాగుంటే వెంటనే రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రోషన్ జమీర్ బాషా, డీఎం కె.శివపార్వతి, తహసీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని, గూడవల్లి పీఏసీఎస్ చైర్మన్ ఆలపాటి నరేంద్ర బాబు, రేపల్లె మార్కెట్ యార్డు డైరెక్టర్ గోగినేని సురేష్, మల్లాది రామకృష్ణ, గడ్డిపాటి వెంకట్, పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు, కేజీఏ శ్రీనివాసన్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకతతో కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 2.91 లక్షల ఎకరాలలో 1.66 లక్షల మంది రైతులు వరి సాగు చేశారన్నారు. 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా మిల్లులు, రైతులను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. 117 కొనుగోలు కేంద్రాలను ఆర్‌ఎస్‌కేలలో ఇప్పటికే ప్రారంభించామన్నారు. గతేడాదిలో 90 వేల టన్నులు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. 73373 59375 వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని పంపితే స్లాట్ బుక్ చేస్తారన్నారు. 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
వరకట్న వేధింపులు నేరం
వరకట్నం కొరకు వేధించినా, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వరకట్న వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. 2025లో ఇప్పటివరకు 201 కేసులు నమోదు కాగా, ఇద్దరు హత్యకు గురయ్యారని తెలిపారు. మూడేళ్లలో మొత్తంగా 655 కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో ఏడుగురు మృతి చెందగా, 9 మంది హత్యకు గురయ్యారన్నారు.
సాధారణ అంగన్వాడీలుగా మినీ కేంద్రాలు
మినీ అంగన్వాడీ కేంద్రాలను ఇక సాధారణ కేంద్రాలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల విలీనంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరిన్ని సేవలు అందించే క్రమంలో మినీ అగన్వాడీ కేంద్రాలను ఇలా మార్పు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. మినీ కేంద్రాల కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.ఏడు వేలు ఇస్తుండగా, మార్పు తర్వాత రూ.11,500 అందుకుంటారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీఈఓ పురుషోత్తం, బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్


