
భావపురిలో బాపు అడుగుజాడలు
బాపట్ల అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాన మువ్వన్నెల జెండా దేశభక్తిని నింపుకొని రెపరెపలాడుతోంది. బ్రిటిష్ దొరల నిరంకుశత్వాన్ని ఎందరో మహనీయులు ధిక్కరించారు. బతుకుదెరువుకు వచ్చి తమపైనే మీ పెత్తనమేంటంటూ నిలదీశారు. తుపాకీ గుళ్లకు గుండెలను అడ్డుపెట్టి తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించారు. అహింసే ఆయుధంగా చేసుకుని భరతమాతను స్వేచ్ఛా విహంగంగా మార్చారు. ఇంతటి స్వాతంత్య్ర పోరాటంలో బాపట్ల జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది.
బాపట్లకు విచ్చేసిన మహనీయులు
1929 ఏప్రిల్ 17న మహాత్మా గాంధీజీ ఖద్దరు ఉద్యమ వ్యాప్తికోసం మంతెనవారిపాలెం వచ్చారు. అక్కడ కనుమూరి వెంకట రాజు ఇంట్లో బస చేశారు. స్వాతంత్య్రం కోసం ఎటువంటి త్యాగాలకై నా సిద్ధంకండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అక్కడ నుంచి ఏప్రిల్ 18న బాపట్లకు విచ్చేశారు. 1933 డిసెంబర్‌లో పెను తుపాను సందర్భంగా బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు రెండోసారి గాంధీజీ బాపట్ల వచ్చారు. 1934లో బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభలో నెహ్రూ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రసంగించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. మహాత్మా గాంధీజీ బాపట్ల ప్రాంత పర్యటనకు రాగా తిలక్ స్వరాజ్య నిధికి నగదుతోపాటు బంగారు ఆభరణాలను దేశభక్తులు సమర్పించారు.
మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణం
1931 సంవత్సరంలో గాంధీ బాపట్లలో నడయాడిన రహదారికి మహాత్మాగాంధీ రోడ్డుగా నామకరణం చేశారు. బాపట్ల తాలూకా ఆఫీస్ నుంచి భావన్నారాయణ స్వామి గుడికి వెళ్లే రోడ్డును మహాత్మా గాంధీ రోడ్డు అని పిలుస్తున్నారు.
సహాయ నిరాకరణోద్యమంలో..
1920లో సహాయ నిరాకరణోద్యమం జరగ్గా బాపట్ల తాలూకాలోని 64 గ్రామాల్లో సంఘాలను ఏర్పరచి ఉద్యమాలను నడిపారు. కొందరు రెవెన్యూ ఇన్‌్‌స్పెక్టర్లు, గుమస్తాలు తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి న్యాయవాదులతోపాటు ఉద్యమంలో చేరారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందున బాపట్ల ప్రాంతానికి చెందిన ఆంధ్రరత్న దుగ్గిరాలతోపాటు మంతెన క్రిష్ణంరాజు, బూదరాజు లక్ష్మీనారాయణ, బూదరాజు లక్ష్మీనరసింహారావు, పిల్లుట్ల హనుమంత రావు, అడుసుమల్లి శ్రీనివాసరావు పంతులు వంటి వారు జైలు పాలయ్యారు. ఉద్యమంలో భాగంగా 1921 డిసెంబర్ 31న 48 మంది గ్రామోద్యోగులు రాజీనామాలు సమర్పించారు.
విదేశీ వస్తు బహిష్కరణ
పన్నుల నిరాకరణోద్యమంలో భాగంగా నాటి బాపట్ల తాలూకాలోని పెదనందిపాడులో ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేశారు. సంకా సీతారామయ్య, దాసరి శ్రీరాములును పెదనందిపాడు నుంచి చిలకలూరిపేట వరకు 8 మైళ్లు గుర్రం వెంట శిక్షగా పరుగెత్తించారు. 1930లో సాగిన ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల తాలూకాలోని 124 మందిని నాటి ప్రభుత్వం జైలుకు పంపింది. విదేశీ వస్తు బహిష్కరణలలో పాలుగొన్నందుకు 44 మందికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు శిక్ష విధించారు.
బాపట్లలో ఖద్దరు ఉద్యమవ్యాప్తికి పిలుపునిచ్చిన గాంధీజీ కదిలివచ్చిన బాపట్ల ప్రజలు బాపు నడయాడిన రహదారికి మహాత్మాగాంధీ రోడ్డుగా నామకరణం స్వాతంత్య్ర సంబరాల్లో స్మరించుకుంటున్న జిల్లా వాసులు

భావపురిలో బాపు అడుగుజాడలు