
పంటలు వర్షార్పణం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో రెండురోజులుగా భారీవర్షం కురుస్తోంది. మంగళవారం ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో బుదవారం ఉదయంనాటికి జిల్లాలో సగటున 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రేపల్లె, వేమూరు, బాపట్ల, నియోజకవర్గాల్లో వేలాది హెక్టార్లలో వరినాట్లు నీటమునిగాయి. బుధవారం సాయంత్రం నాటికి జిల్లాలో పై మూడు నియోజకవర్గాల పరిధిలో వెద పద్ధతిలో 32 వేలు, నాట్లు పద్ధతిలో 8 వేల హెక్టార్ల చొప్పున మొత్తం 40 వేల హెక్టార్లలో వరిపంట సాగైంది. వర్షాల కారణంగా కర్లపాలెం మండలంలో 2,512 హెక్టార్లు, అమృతలూరులో 4,978, చుండూరు మండలంలో 4,500, బాపట్ల మండలంలో 2,320, రేపల్లెలో 150, చెరుకుపల్లిలో 230 హెక్టార్ల చొప్పున మొత్తం 15,187 హెక్టార్లలో వరిపంట నీట మునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా. వాస్తవానికి సుమారు 20 వేల హెక్టార్లలో వరి నీట మునిగినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే మరింతగా వరి నీటమునిగి కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగువకు 3.15 లక్షల క్యూసెక్కులు
బుధవారం ప్రకాశం బ్యారేజీవద్ద 3.15 లక్షల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి వరద నీరు పెరిగే అవకాశముంది. దీంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి అధికారులను మరింత అప్రమత్తం చేశారు. వరద సమాచారాన్ని లంక గ్రామాల ప్రజలకు అందించారు. వరద పెరిగితే అన్నిరకాల చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికార యంత్రాగం సన్నద్దమైంది. వర్షం, వరద పరిస్థితులను కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
జిల్లాలో వర్షపాతం ఇలా
మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షం కురవగా పర్చూరు నియోజకవర్గం కారంచేడులో 15 సెం.మీ, కొల్లూరులో 13, చీరాలలో 12, కర్లపాలెంలో 12, వేమరులో 11,అమృతలూరు, బాపట్లల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇంకొల్లులో 9 సెంటీమీటర్లు, రేపల్లెలో 6.5, కొరిశపాడులో 8, భట్టిప్రోలు, నిజాంపట్నంలలో, చినగంజాంలలో 6, అద్దంకిలో 5, జె.పంగులూరులో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లోనూ ఒక మోస్తరు వర్షం కురిసింది.
బాపట్ల మండలం ముత్తాయిపాలెం ప్రాంతంలో వర్షానికి నీట మునిగిన వరి పొలాలు
చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా చివరి ఆయకట్టు కావడంతో ఇక్కడ ఆలస్యంగా వరినాట్లు వేస్తారు. భారీ వర్షాలకు ఇక్కడి బీడు పొలాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి.
ఇంకొల్లు ప్రాంతంలో కురిసిన వర్షం ఇప్పటికే సాగులో వున్న పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు మంచిదని రైతులు పేర్కొంటున్నారు.
అద్దంకి ప్రాంతంలో కొద్దిపాటి వర్షం కురిసింది. ఈ వర్షంతో పొలాలు పదునెక్కుతాయని రైతులు చెబుతున్నారు.
చీరాల ప్రాంతంలో భారీ వర్షం కురిసినా పంటలు లేకపోవడంతో నష్టంలేదు. అరకొరగా వేసిన వేరుశనగ పంటకు వర్షం అనుకూలమని రైతులు పేర్కొంటున్నారు.
వర్షంవల్ల బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం, పిట్టలవానిపాలెం, బాపట్ల రూరల్ మండలాల్లో సాగుచేసిన వరిపంట నీటమునిగింది. వరిపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాలనుంచి నీరు బయటకు వెళ్లేదారిలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు పొలాల్లో నీళ్లువుంటే వరి కుళ్లి పోతుందని, తిరిగి ఎద పద్దతిలో వరిసాగు చేయడం కష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో 87 హెక్టార్లలో వేరుశనగ పంట నీటమునిగింది.
రైతులు అప్రమత్తం కావాలి..
జిల్లాలో వర్షాలు కురుస్తున్నందువల్ల రైతులు అప్రమత్తం కావాలి. వర్షం వల్ల నీటమునిగిన వరి పంటలో నీటిని తొలగించి ఎకరాకు 20 కిలోల యూరియా, 20 కిలోల ఎంఓపీ చల్లుకోవాలి. పొలం తడి ఆరగానే ఎక్సాకోనజెల్ 400 ఎంఎల్, బావిస్టీన్ ఎకరాకు 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. రేపల్లె నియోజకవర్గంలో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉన్నాయి. మార్క్‌ఫెడ్ ద్వారా 20 టన్నుల యూరియా, 20 టన్నుల డీఏపీలను సిద్ధంగా ఉంచాం. అవసరమైన రైతులు వాటిని వినియోగించుకోవాలి. – ఎం.సుబ్రమణ్యేశ్వరరావు,
జిల్లా వ్యవసాయాధికారి

పంటలు వర్షార్పణం

పంటలు వర్షార్పణం