
విద్యార్థినుల అదృశ్యం
కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
వేటపాలెం: ఇద్దరు బాలికలు అదృశ్యమైన కేసును 24 గంటల్లో ఛేదించి బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. బుధవారం సీఐ స్థానిక స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశాయిపేట, వేటపాలెం గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు స్థానికంగా ఉండే కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు.
వీరిద్దరికి చదువుపై ఆసక్తి లేదు. దీంతో మంగళవారం ఇద్దరు కళాశాలకు అని వెళ్లారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి వాకబు చేశారు. ఆచూకీ తెలియకపోవడంలో అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై జనార్దన్ కేసు నమోదు చేసి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మైనర్ బాలికలు అదృశ్యంపై ఎస్పీ సీరియస్‌గా తీసుకొని వారి ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక టీంలు ఏర్పాటు శారు. జిల్లా ఐటీ కోర్ టీం సాంకేతిక సహకారంతో ఇద్దరు మైనర్ బాలికల కోసం గాలింపు చేపట్టారు. బాలికలు ఇద్దరు గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని తీసుకొచ్చి బుధవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదువుకోవాలని మందలించగా అలిగి ఇంటి నుంచి వెల్లిపోయినట్లు తెలిపారు. బాలికలను 24 గంటలోపు కనిపెట్టి కేసును ఛేదించిన చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, రూర్ సీఐ శేషగిరిరావు, ఎస్సై పి. జనార్దన్‌ను ఇంకొల్లు ఎస్సై జీ. సురేష్‌ను ఎస్పీ అభినందించారు.