
2070 నాటికి సూపర్‌పవర్‌గా భారతదేశం
బాపట్ల: భారతదేశం 2070 నాటికి సూపర్ పవర్‌గా తయారవుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమెరికా, చైనా అగ్రదేశాల తర్వాత ఆర్థిక ప్రగతిలో భారతదేశం మూడోస్థానంలో నిలుస్తుందన్నారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి సాధించే దిశగా కృషి జరుగుతుందన్నారు. జిల్లాలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని జాతి సమైక్యతకు చిహ్నంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన చెప్పారు. ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఈనెల 15వ తేదీన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని ఆయన కోరారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య ప్రాధాన్యత, విలువలను ప్రతి ఒక్కరికీ తెలియ జేయాలని ఆయన కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. డీఆర్డీడీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయ లక్ష్మి, డీఎంహెచ్‌ఓ విజయమ్మ, ఎకై ్సజ్ శాఖ ఈఎస్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్లలో తిరంగా ర్యాలీ