
అసెస్‌మెంట్.. హరాస్‌మెంట్!
పరీక్షల సంస్కరణ పేరిట మూల్యాంకన పుస్తకాలు పంపిణీ పాఠశాలల్లో సమయం సరిపోదంటున్న ఉపాధ్యాయులు కూటమి సర్కార్ అడ్డగోలు నిర్ణయాలతో అందరికీ అవస్థలు విద్యార్థులకు కూడా నష్టం చేసేలా కొత్త విధానం అమలు
కూటమి పాలనలో అడ్డగోలు నిర్ణయాలతో గురువులపై భారం
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ తీరు అధ్వానంగా మారింది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేస్తుండటంతో విద్యాప్రమాణాలు తీసికట్టుగా మారుతున్నాయి. ఇదే కోవలో పరీక్షల్లో అసెస్‌మెంట్ పుస్తకాల విధానంతో అటు విద్యార్థులు, ఇటు గురువులు నష్టపోతున్నారు. మూల్యాంకన భారం గురువులపై పడుతోంది. విద్యార్థులు కూడా గతంలో రాసిన సమాధానాలే మళ్లీ చూసి రాసేలా తెచ్చిన ఈ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చీరాల అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన పుస్తకాలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అమలు చేస్తున్న బోధనేతర పనులతో వారు సతమతం అవుతున్నారు. ఈ తరుణంలో కొత్తగా మూల్యాంకన పుస్తకాలను కూటమి సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. గతంలో పరీక్షల సమయంలో కాగితాలపై జవాబులు రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకువెళ్లి దిద్దేవారు. ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలను విద్యార్థులకు అందించారు. చీరాల మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 7,315 పుస్తకాలను అందించారు.
పరీక్షలు ప్రారంభం
విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపు కోసం ఏటా ఫార్మెటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను గతేడాది నుంచి, సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొదటి పరీక్షను సోమవారం నిర్వహించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ పరీక్షలు ఈనెల 4వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. అసెస్‌మెంట్ బుక్‌లెట్స్ పాఠశాలలకు చేరుకోవడం ఆలస్యం కావడంతో సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. జూన్, జూలై సిలబస్‌కు సంబంధించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పరీక్షలు పెట్టారు.
దిద్దేందుకు సమయమేది?
గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను ఇంటికి తీసుకెళ్లి దిద్ది పాఠశాలలకు తీసుకువచ్చేవారు. ఉపాధ్యాయుల వెసులుబాటును బట్టి బడిలోనే పేపర్లను దిద్దేవారు. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి మోసుకెళ్లే పరిస్థితి లేదు. ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులంటే మూల్యాంకనం పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి దిద్దడానికి వీలులేదు. హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు నాలుగు తరగతులకు వెళ్తే వారం పాటు ఇదే పని చేస్తేగానీ పూర్తవుతుంది. ఈ పుస్తకాలను సబ్జెక్టు ఉపాధ్యాయుడు భద్రపరచుకోవాలి. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు అమలు చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలని ఉపాధ్యాయులు గుర్తుచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనీసం నిపుణులతోనైనా చర్చించాల్సి ఉందన్నారు. అలా కాకుండా ఏకపక్షంగా అమలు చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
నిర్బంధంగా ‘విద్యాశక్తి’
హైస్కూళ్లలో సాయంత్రం 4 గంటల తర్వాత విద్యాశక్తి కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. ముందు ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తామని చెప్పి అన్నిచోట్ల ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయ సంఘాలు అడిగినప్పుడు నిర్బంధం కాదని చెబుతున్న ఉన్నతాధికారులు.. ఆ తర్వాత మాత్రం ఉపాధ్యాయులపై మండల స్థాయి అధికారులతో ఒత్తిడి తెస్తున్నారు. ‘మేం వస్తున్నాం.. తనిఖీ చేస్తాం’ బెదిరిస్తున్నారు.