
‘జీరో’ దందాలో అక్రమ ‘వసూళ్లు’
చీరాల కేంద్రంగా జీరో వ్యాపారం పలు ప్రాంతాలకు వేరుశనగ పప్పు అడ్డగోలుగా సరఫరా జీఎస్టీ లేకుండానే జోరుగా వ్యాపారం కనీసం పట్టించుకోని అధికారులు జీడిపప్పు విషయంలో సగం కొనుగోలుకు మాత్రమే జీఎస్టీ రెడీమేడ్ వస్త్రాలు అక్రమ మార్గాన సరఫరా పలు పార్శిల్ కార్యాలయాల్లో జీఎస్టీ లేని వస్త్రాల నిల్వలు నెలకు రూ.కోట్ల మేరకు సర్కారు ఖజానాకు నష్టం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నదిగువ స్థాయి సిబ్బంది
ఫిర్యాదు అందితే చర్యలు
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కొందరు జీరో వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. అధికారులు, వ్యాపారాలు కుమ్మకై ్క లాభాలను అందినకాడికి జేబుల్లో వేసుకుంటున్నారు. చీరాల కేంద్రంగా జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. కింది స్థాయి సిబ్బంది వసూళ్లతో కనీస చర్యలు లేవు.
చీరాల: ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులను ఎగవేస్తూ కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. జీరో వ్యాపారం సాగించడంతో ఖజానాకు పన్నుల రూపంలో అందాల్సిన నగదు తాయిలాలుగా మారుతోంది.
తక్కువ చేసినట్లుగా చూపించి..
ఇంత జరుగుతున్నా జీఎస్టీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. వాణిజ్య సంస్థలు నడుపుతున్న వ్యాపారాలు వారు చేసే లావాదేవీలకు సంబంధించి ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో పన్నులను సక్రమంగా చెల్లించాలి. వ్యాపారం అధిక మొత్తంలో చేస్తూ తక్కువ చేసినట్లుగా చూపించి జీఎస్టీని ఎగవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారస్తులు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నా జీఎస్టీ వసూళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. చీరాల ప్రాంతంలో వేరుశనగ పప్పు మిల్లులు, వస్త్ర వ్యాపారం, జీడిపప్పు, ధనియాలు ఎక్కువ మొత్తంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. వేరుశనగ పప్పు మిల్లుల యజమానులు సరైన బిల్లులు లేకుండానే రూ.లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలకు, చెల్లించే పన్నులకు పొంతన ఉండదు. అంతా జీరో వ్యాపారమే. జీఎస్టీ లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రెడీమేడ్ వస్త్రాలదీ అదే దుస్థితి..
చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం ప్రాంతంలో ఎక్కువగా జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు జీడిపప్పును నామమాత్రపు బిల్లులతో తరలించేస్తున్నారు. చెల్లించే నగదుకు రాసే బిల్లుకు పొంతన లేకుండా ఉంది. వస్త్ర వ్యాపారానికి సంబంధించి రెడీమేడ్ వస్త్రాలకై తే అసలు కాగితాలే ఉండవు. పండుగ సీజన్లలో ముంబయి, కోల్‌కత్తా ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో వస్త్రాలను దిగుమతి చేసుకుంటారు. అధికారుల కళ్లుగప్పి రైల్వే పార్శిల్స్‌లో, ట్రాన్స్‌పోర్టు వాహనాలలో చీరాలకు తరలిస్తున్నారు. గతంలో రైల్వే పార్శిల్‌లో దిగుమతి చేసుకున్న రెడీమేడ్ వస్త్రాలను ఆదాయ పన్ను అధికారులు పట్టుకున్నారు. పేరుకు మాత్రమే వ్యాపార సంస్థగా చలామణి అవుతూ సరైన బిల్లులు, రబ్బర్ స్టాంపులు లేకపోవడంతో పార్శిల్ కార్యాలయాల్లో ఉండిపోతున్నాయి. ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ జీఎస్టీలు లేకుండా ఎక్కువగా సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా దిగుమతి అయిన మూటలు పార్శిల్ కార్యాలయాల్లో నిల్వ ఉండి పోతున్నాయి. బిల్లు కావాలంటే ఎక్కువ ధర అవుతుందని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు.
అధికారుల ఉదాసీనత..
జీరో వ్యాపారంలో జరిగే అక్రమాలు గురించి జీఎస్టీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. జీరో బిజినెస్‌కు ఒక్క రూపాయి కూడా జీఎస్టీ రాదు. జీఎస్టీ అధికారులు, ఆడిటర్లు కూడా పన్నులు తగ్గించేందుకు వ్యాపారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టీలు నుంచి ప్లాస్టిక్ సామాన్లు వరకు ఏ వస్తువు తీసుకున్న జీఎస్టీ బిల్లు ఉండదు. మొబైల్ షాపుల బిజినెస్ కూడా జీరో వ్యాపారమే. జీఎస్టీ అధికారులను దీనిపై అడిగితే ‘మాకు తనిఖీ చేసే అధికారం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు ఆదేశిస్తారంటూ’ చెబుతున్నారు. ఇదే అదనుగా కొందరు దిగువ స్థాయి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పార్శిల్ కార్యాలయాలలో తనిఖీలు చేస్తూ అపరాధ రుసుము విధిస్తున్నారు.
చీరాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టాను. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే. త్వరలో వేరుశనగ పప్పు మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, రెడీమెడ్ వస్త్రాలతోపాటు చీరాల కేంద్రంగా జరుగుతున్న వ్యాపార లావాదేవీలపై దృష్టి పెడతాం. తనిఖీలు చేపట్టి జరిమానాలు విధిస్తాం. అవసరాన్ని బట్టి జీఎస్టీ వసూలు చేస్తాం.
– శ్రీనివాస్,
జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్, చీరాల