డిగ్రీ అడ్మిషన్ల కోసం పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ అడ్మిషన్ల కోసం పడిగాపులు

Aug 11 2025 6:45 AM | Updated on Aug 11 2025 6:45 AM

డిగ్రీ అడ్మిషన్ల కోసం పడిగాపులు

డిగ్రీ అడ్మిషన్ల కోసం పడిగాపులు

వేటపాలెం: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి ఎదురుచూస్తున్నారు. ఫలితాలు వెలువడి నాలుగు నెలలు గడుస్తున్నా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అడ్మిషన్లకు ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. గత ఏడాది మాదిరిగా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌ లైన్‌లో చేపడతారో లేదో తెలియని పరిస్థితి.

కోర్సుల కన్వర్షన్‌ కోసం

ఇంటర్‌ ఫలితాలు వచ్చిన తరువాత ప్రభుత్వం రాష్ట్రంలోని డిగ్రీ విద్యలో సింగిల్‌ మేజర్‌ విధానంలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా కళాశాలలు కోర్సులు కన్వర్షన్‌ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కోర్సుల కన్వర్షన్‌ పూర్తయితే గాని డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వ షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉందని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు.

గత ఏడాదీ ఆలస్యమే..

గత ఏడాది కూడా ఆలస్యంగా అడ్మిషన్లు చేపట్టడంతో చాలా కళాశాలల్లో సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. దీంతో కళాశాలల్లో అడ్మిషన్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల్సిన కూటమి సర్కార్‌ వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుందనే విమర్శలు వినబడుతున్నాయి.

ప్రభుత్వ కళాశాల్లో పరిస్థితి ఇదీ..

ఇంటర్‌ ఫలితాలు ఏప్రిల్‌ 12న విడుదలై నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాలపై నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. జూన్‌లోనే పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ప్రారంభం చేసి తరగతులను నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో కూడా 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను చేపట్టి తరగతులను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియపై సరైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. మూడు నెలల నుంచి డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఆడ్మిషన్లు ఆలస్యమవుతుండటంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలు ఫలితాల్లో వెనుకబడి పోతున్నాయి. సమయానికి అడ్మిషన్లు జరగక, కోరుకున్న కళాశాల్లో కావాల్సిన గ్రూపులు అందుబాటులో లేక విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

నియోజవర్గంలో 2 వేల మంది

చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎయిడెడ్‌ కళాశాల, మూడు ప్రైవేట్‌ కళాశాలలున్నాయి. వివిధ గ్రూపుల్లో దాదాపు 2 వేల మంది విద్య అభ్యసిస్తున్నారు. ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో మూడు వేల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. అందులో రెండు వేల మందికి పైగా డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూసుస్తున్నారు. ఒక నియోజకవర్గంలోనే ఇంత మంది ఉంటే జిల్లాలో ఇంకెంత మంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

నాలుగు నెలల కిందట ఇంటర్‌ ఫలితాల విడుదల ఇప్పటి వరకు డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల చేయని ప్రభుత్వం

ఎదురు చూస్తున్నాం: నజ్మా, విద్యార్థి

డిగ్రీలో చేరడానికి ప్రభుత్వ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంటర్‌ ఫలితాలు వచ్చి మూడు నెలలు కావస్తోంది. ఎక్కడ చేరాలో ఏమి చేయాలో తెలియక అయోమయంగా ఉంది. ప్రవేశాలపై ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వడం లేదు. ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లో తీసుకుంటారో తెలియని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement