కేంద్ర ప్రభుత్వ విధానంతో పెన్షనర్లకు నష్టం
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆందోళన
మార్టూరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ సర్వీస్ రూల్స్– 1972 సవరణ చట్టం విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపమని సంఘం మార్టూరు యూనిట్ అధ్యక్షులు కొరిటేల రామారావు పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సమావేశం హాలులో ఆదివారం నిర్వహించిన యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సవరణ చట్టం ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం చేపట్టే పీఆర్సీ నుంచి విశ్రాంత ఉద్యోగులను మినహాయిస్తారన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ వర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయటం వల్ల పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేతన సవరణ చట్టం అనేది ఉద్యోగులకు కాలానుగుణంగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం కల్పిస్తూ వస్తున్న సౌకర్యం అని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులను దీని నుంచి మినహాయించడం వారిపై వివక్ష చూపటమేనని ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్యంలో పెన్షనర్లు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు. పీఆర్సీ సవరణ చట్టం నుంచి వారిని మినహాయించడం సబబు కాదని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించనున్న ఈ చట్టాన్ని తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు. విశ్రాంత ఉద్యోగులంతా ఏకమై దీన్ని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రావుల బాపయ్యచౌదరి, ఎం. ఎస్. చిట్టిబాబు, పి.శివరామ కోటేశ్వరరావు, మర్రి కోటేశ్వరరావు, పి.అంకయ్య, వెంకటేశ్వర్లు, రాజేంద్రబాబు పాల్గొన్నారు.


