
వివరాలు తెలియజేస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ
రేపల్లె: ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసి బంగారు నగలను అపహరించిన సంఘటనలలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ తెలిపారు. స్థానిక రేపల్లె రూరల్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన బంగారు నగల చోరీకి పాల్పడిన వారి వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన చెరుకుపల్లికి మండలానికి చెందిన యుగంధర్‌రెడ్డి (కుంచాలవారిపాలెం), నగరాజకుమారి(లక్ష్మీనివాస్‌కాలనీ), శివనాగరెడ్డి (తుమ్మలపాలెం), మణికంఠ (యల్లారెడ్డిపాలెం)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. యుగంధర్ రెడ్డి తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా జీవిస్తూ ఉంటాడని, వీర నగరాజకుమారి భర్తతో విడిపోయి విడిగా తన పిల్లలను చదివిస్తూ వంట పనులు చేసుకుంటు ఉంటుందన్నారు. యుగంధర్‌రెడ్డి తన ఆటోలో నగరాజకుమారిని వెంటపట్టుకుని వంట పనులకు వెళుతుండేవాడన్నారు. యుగంధర్ రెడ్డి స్నేహితులు శివ నాగిరెడ్డి, మణికంఠ రెడ్డిలు దురలవాట్లకు బానిసలైనారని చెప్పారు. నిందితులు నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలలో ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కొని, వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులను జల్సాలకు వాడుకునేవారన్నారు. ఈ విధంగా అడవులదీవిలో 3 కేసులు, చెరుకుపల్లి 2, నిజాంపట్నంలో ఒక కేసు, భట్టిప్రోలు పోలీసు స్టేషన్‌లో ఒక కేసు మొత్తం 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు. బాధితుల పిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని చెప్పారు. రేపల్లె రూరల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సహాయంతో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 107.056 గ్రాములు బంగారు ఆభరణాలు, ఒక జత వెండి కాళ్ల పట్టీలు, ఆటో, ద్విచక్రవాహనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చుతున్నట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ శివశంకర్, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు 106.56 గ్రాముల బంగారం స్వాధీనం