సాక్షి, మదనపల్లె : జిల్లాలో సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల విచారణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ ఆహ్మద్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సర్ కార్యక్రమంపై వినతులను స్వీకరించారు. జిల్లాలో 1,31,085 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా, ఇంతవరకు 93,271 మంది ఓటర్లను విచారించినట్లు అధికారులు చెబుతున్నారని, మిగిలిన ఓటర్లను ఎప్పుడు విచారిస్తారని కోరారు. పీలేరు నియోజకవర్గంలో 36.21 శాతం, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 34.16 శాతం, పుంగనూరు నియోజకవర్గంలో 30.24 శాతం, రాయచోటి నియోజకవర్గంలో 29.16 శాతం, మదనపల్లె నియోజకవర్గంలో 11.70 శాతం మంది ఓటర్ల విచారణ ఇంకా పూర్తి చేయాల్సి ఉందని జేసీ దృష్టికి తెచ్చారు. అర్హులకు ఓటు హక్కు కొనసాగే అవకాశం కల్పించి, అనర్హులు, డూప్లికేట్ నమోదులను నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు పెండింగ్‌లో ఉన్న విచారణలను వేగవంతం చేసి, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జింకా వెంకటా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్.రెడ్డి పాల్గొన్నారు.


