సాక్షి, మదనపల్లె : వర్షాభావ పరిస్థితులతో మదనపల్లె పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టామని కలెక్టర్ నిశాంత్‌కుమార్ గురువారం తెలిపారు. ఈ మేరకు జలవరులశాఖ అధికారులు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు మొదలు పెట్టినట్టు తెలిపారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీటి సామర్థ్యం 30 ఎంసీఎఫ్‌టీలు కాగా దీన్ని 40 ఎంసీఎఫ్‌టీలకు, గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సామర్థ్యం 40 ఎంసీఎఫ్‌టీలు కాగా 50 ఎంసీఎఫ్‌టీలకు పెంచేలా పనులను చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండింటి ద్వారా 90 ఎంసీఎఫ్‌టీల నీటిని నిల్వ చేసుకుంటే పట్టణ ప్రజలకు వచ్చే జూన్ వరకు తొమ్మిది నెలల పాటు నీటి సమస్య ఉండదని తెలిపారు. ఎస్‌ఎస్ ట్యాంకుల్లో పూర్తి నీటి నిల్వ మట్టం కన్నా దిగువన ఉండటం వలన పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని, దీనికి వాటి లోతు పెంచేందుకు పూడిక తీసి అదనపు నీటిని నిల్వ చేసే విధంగా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ట్యాంకుల్లో వ్యర్థాలు వేయడం వల్ల సమస్యగా మారుతోందని, వీటిలో చెత్త, నిర్మాణ వ్యర్థాలను వేయకుండా ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇకపై నిర్మాణ వ్యర్థాలు, చెత్తను డంపింగ్ చేసే వాహనాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్


