సాక్షి, మదనపల్లె : తమకు ఆర్థిక ప్రయోజనాలు అందివ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా స్థానిక కలెక్టరేట్, సబ్ కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. డీఆర్‌ఓ వెంకటేశుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచిరావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు, ఐఆర్, ఇతర హక్కులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి బకాయిలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా చేయి చేయి కలుపుదాం– హ్యాండ్ టూ హ్యాండ్ కార్యక్రమాన్ని కూడా జిల్లాలో నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలను సందర్శిస్తూ ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేసి, ఉద్యమం చేపట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఉద్యోగులను ఐక్య ఉద్యమానికి సంసిద్ధులను చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ విబేధాలు లేకుండా ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలను ఐక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ పి.నరసింహ కుమార్, ఏపీ జేఏసీ జిల్లా కార్యదర్శి గోపి, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి బాబ్జి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శ్రావణి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల సంఘ కార్యదర్శి వంశీ, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామలింగారెడ్డి, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, జీఎస్‌డబ్ల్యూఎస్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అనుబంధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు


