మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని సీటీఎంలో సుమారు రూ.30 కోట్ల విలువైన అరెకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్లు దర్యాప్తులో నిర్ధారించినట్లు దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన మదనపల్లెలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడాతూ.. శ్రీ ఆంజనేయ స్వామి మాన్యానికి చెందిన భూములను కబ్జా చేసి విక్రయించడంతో పాటు పూలు, పండ్ల తోటలు సాగు చేస్తూ విక్రయించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దేవుని భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ అంశంపై సాక్షి పత్రికలో వరుస కథనాలు ప్రచురించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో దేవాదాయ భూమిని కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తమ శాఖ పరిశీలనతో పాటు దర్యాప్తులోనూ సాక్షి కథనాల్లో పేర్కొన్న సర్వే నంబర్ల ఆధారంగా సుమారు రూ. 30 కోట్ల భూమి కబ్జా జరిగిందన్నారు. ఆ భూమి విస్తీర్ణం ఆరు ఎకరాలు ఉన్నట్లు గుర్తించి, కబ్జాకు గురైనట్లు నిర్ధారించామన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలను రద్దు చేయించి, దేవాదాయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని విశ్వనాథ్ స్పష్టం చేశారు.
నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్
కమిషనర్ విశ్వనాథ్


