టీడీపీ నేత కనుసన్నల్లో జూదశాల | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కనుసన్నల్లో జూదశాల

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

బద్వేలు అర్బన్‌ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రమార్గంలో ఉపయోగిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఒక ఘరానా హైటెక్‌ జూదశాల గుట్టును వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు అర్బన్‌ పోలీసులు రట్టు చేశారు. అయితే బుధవారం పోలీసులు వెలుగులోకి తెచ్చిన ఈ తెలుగుగంగ కాలనీ రోడ్డులోని జూదగృహం వెనుక స్థానిక అధికార పార్టీ రాజకీయ హస్తం ఉండటం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు శ్రీకాంత్‌ ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ టీడీపీ నాయకుడని, కొన్ని నెలల క్రితం వరకు సదరు పార్టీ ముఖ్యనేతకు అత్యంత ప్రధాన అనుచరుడిగా చలామణి అయ్యాడని తేలింది. అంతేకాకుండా ఇతను బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో రౌడీషీటర్‌గా కూడా నమోదై ఉన్నాడు.

రాజకీయ అండతోనే అక్రమ సామ్రాజ్యం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు రాజకీయ అండదండలు మెండుగా ఉండటంతోనే శ్రీకాంత్‌ తన ఇంట్లో ఏకంగా అక్రమ జూదసామ్రాజ్యాన్ని సృష్టించినట్లు స్థానికంగా బలంగా ప్రచారం జరుగుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే జూదరుల కోసం ఈ జూదశాలలో మందు, విందు వంటి అన్నీ సౌకర్యాలను అక్కడే అందుబాటులో ఉంచి.. ఒక మినీ క్లబ్‌ను తలపించేలా ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైన్‌షాపుల నుండి పెద్ద ఎత్తున మద్యం, బీరు బాటిళ్లను కొనుగోలు చేసి అక్కడకు వచ్చే వారికి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

కువైట్‌ డివైజ్‌లతో ఘరానా మోసం

మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు కువైట్‌ నుండి ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్‌ స్కానింగ్‌ డివైజ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, డిజిటల్‌ ఇయర్‌ఫోన్లు కొనుగోలు చేశారు. జూదం కోసం ప్రత్యేక కోడింగ్‌ ఉన్న పేకముక్కలను తెప్పించారు. ఆట ప్రారంభానికి ముందే పేకముక్కలను ఎలక్ట్రానిక్‌ స్కానింగ్‌ డివైజ్‌ ద్వారా స్కాన్‌ చేసి, ఆట సమయంలో ఏ పేకముక్క లోపల పడుతుందో, ఏది బయట పడుతుందో డిజిటల్‌ ఇయర్‌ఫోన్ల ద్వారా ముందే తెలుసుకునేవారు. ఇలా ’మంగతాయి’ జూదం ఆడడానికి వచ్చే అమాయకులను పక్కా ప్లాన్‌తో మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకునేవారు.

9 మంది అరెస్ట్‌.. రూ.40,500 స్వాధీనం

విశ్వసనీయ సమాచారంతో బద్వేలు అర్బన్‌ ఎస్‌ఐలు యు.వై.జయరాములు, ఎం.రంగారావు తమ సిబ్బందితో సదరు ఇంటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు పుంగునూరు శ్రీకాంత్‌తో పాటు షేక్‌ అబీద్‌, నూతి శ్రీను, పాల వెంకటరమణ, నారుబోయిన సాంబయ్య, చిలుమూరు శివారెడ్డి, మాబు రసూల్‌, పుంగనూరు రామకృష్ణ, ఉండ్రా హరిలను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి రూ.40,500 నగదు, మూడు ఐఫోన్‌ మోడల్‌ స్కానింగ్‌ పరికరాలు, మూడు డిజిటల్‌ ఇయర్‌ ఫోన్లు, రెండు బ్లూటూత్‌ పరికరాలు, పేకముక్కలతో పాటు 35 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మినీ క్లబ్‌ను తలపించేలా ఏర్పాట్లు

కేసులో ప్రధాన నిందితుడు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ రౌడీషీటర్‌ పుంగనూరు శ్రీకాంత్‌

అధికార అండదండలతోనే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ జూదగృహం

ఎలక్ట్రానిక్‌ స్కానింగ్‌ డివైజ్‌లతో ఘరానా మోసం.. 9 మంది ముఠా సభ్యుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement