సదుం : బోరు కేబుల్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. బాధిత రైతుల కథనం మేరకు.. ఊటుపల్లె పంచాయతీ తుమ్మగుంటపల్లె సమీపంలోని పొలాల వద్ద రమణయ్య, కృష్ణయ్య, జనార్ధన, బసవయ్య, అశోక్, నాగలక్ష్మీ, రెడ్డెప్ప తదితరులకు చెందిన మోటర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. వాటి విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
పాము కాటుతో రైతుకు అస్వస్థత
మదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తుండగా రైతును పాము కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కురబలకోట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని తుంగవారిపల్లికి చెందిన గోపాలు (65) ఉదయం పొలంలో పనులు చేస్తుండగా పాము కాటేసింది. దీంతో ఆయన కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
8 మంది జూదరులు అరెస్టు
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం కొండామారిపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో లారీలో జూదమాడుతున్న వారిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ కళా వెంకటరమణ వివరాల ప్రకారం.. కొండామారిపల్లె సమీపంలోని బైపాస్ రోడ్డు ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో లారీలో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఎస్పీ బుచ్చి రాజు ఆదేశాలతో ఎస్‌ఐ విష్ణు నారాయణ, పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పెన్నానదిలో మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు శివారులోని రామేశ్వరం గంగమ్మ ఆలయం వెనుక పెన్నానది నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం రూరల్ పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఎస్‌ఐ తెలిపారు. అతను రెండు, మూడు రోజుల క్రితం నీటిలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


