రొంపిచెర్ల : ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన అనంతపురం–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ చల్లావారిపల్లెకు చెందిన యశ్వంత్ రెడ్డి(17) ద్విచక్రవాహనంపై పీలేరుకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి చల్లావారిపల్లెకు వెళుతుండగా రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు సమీపంలోని మోడల్ స్కూల్ వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
హత్య కేసులో
నిందితుడు అరెస్ట్
వీరబల్లి : వీరబల్లి మండలం ఓదివీడు కస్పాలో గత నెల 29న సయ్యద్ కాసింవలి అనే వ్యక్తి అదే గ్రామంలోని షేక్ షాహిదా ఇంట్లో హత్యకు గురయ్యాడు. పోలీసులు విచారణ చేపట్టి షేక్ హుస్సేన్బాషా, షేక్ నాగిన్ బాషా, షేక్ ఖాదర్‌వలీ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులలో ఒకరైన ఖాదరవలీని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. మిగతా ఇద్దరు పరీరాలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సుండుపల్లె సీఐ సురేష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
పుంగనూరు : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన సంఘటన పుంగనూరులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రహమ్మత్‌నగర్‌కు చెందిన మస్తాన్, ఇమ్రాన్ గుజిరీ వ్యాపారం చేసేవారు. వారు ఆటోలో ఇంటికి వస్తుండగా బాలాజీ థియేటర్ వద్ద వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో మస్తాన్, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు.
గాయపడిన మస్తాన్, ఇమ్రాన్


