దాతలు దయతలిస్తే.. బతుకుతా..! | - | Sakshi
Sakshi News home page

దాతలు దయతలిస్తే.. బతుకుతా..!

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

మైదుకూరు : ‘నాకు బతకాలని ఉంది.. అందరిలాగే రోజూ పాఠశాలకు వెళ్లాలని ఉంది.. స్నేహితులతో కలిసి ఆడుకోవాలని కూడా ఉంది.. అయితే నేను తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాను‘ ఇది వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు పట్టణ శివార్లలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన షేక్‌ అబ్దుల్‌ మతీన్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడి ఆవేదన. ప్రాణాంతక వ్యాధి కబళిస్తున్నా.. ఎప్పటికై నా దాతలు తనను ఆదుకోకపోతారా అని ఆ చిన్నారి చూస్తున్న ఎదురుచూపులు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి.

రెండేళ్లుగా నరకయాతన.. డ్రైవర్‌ తండ్రి తలరాత!

మైదుకూరు సర్వాయపల్లె రోడ్డులో నివసించే షేక్‌ అమీర్‌ బాషా దంపతుల మూడో సంతానమైన మతీన్‌, పట్టణంలోని ఒక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురై నీరసించిపోతుండటంతో కంగారుపడిన తల్లిదండ్రులు స్థానికంగా రక్తం ఎక్కించారు. ఆ రక్తం కాస్తా మెదడుకు చేరి ఇన్ఫెక్షన్‌ కావడంతో బెంగళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బాలుడికి ’తలసేమియా’ సోకినట్లు వైద్యులు తేల్చారు. వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి అమీర్‌ బాషా, కొడుకు ప్రాణాలను దక్కించుకోవడం కోసం అప్పులు సప్పులు చేసి రెండేళ్లుగా దాదాపు రూ.4లక్షల దాకా ఖర్చు చేశారు.

బోన్‌ మ్యారో మార్పిడి ఒక్కటే మార్గం..

హైదరాబాద్‌లో ప్రిపరేషన్‌

చిన్నారి మతీన్‌కు ఈ ప్రాణాంతక వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ’బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ శస్త్రచికిత్స చేయడం ఒక్కటే ఏకై క పరిష్కారమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ శస్త్ర చికిత్స ఖర్చుల కొరకు ఏకంగా రూ. 15 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. అంతటి భారీ మొత్తాన్ని సమకూర్చుకునే స్తోమత లేక ఆ కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ చిన్నారి దీన పరిస్థితిపై గత ఏడాది ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించిన కొంతమంది దాతల సహకారంతో ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స నిమిత్తం బాలుడిని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ’లోటస్‌ లిటిల్‌ స్టార్స్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌’లో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో, ఆపరేషన్‌ ముందస్తు ’ప్రిపరేషన్‌’ ప్రక్రియను పొందుతున్నాడు.

దేవుడిలా అండగా నిలిచిన ‘కిన్నెర ట్రస్ట్‌’

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మత్తీన్‌ కుటుంబానికి ‘కిన్నెర మెమోరియల్‌ ట్రస్ట్‌’ దేవుడిలా అండగా నిలిచింది. పేద పిల్లలకు ఉచితంగా బోన్‌ మ్యారో, ల్యుకేమియా చికిత్సలు అందించే తమ సేవా సంకల్పంలో భాగంగా ఈ ట్రస్ట్‌ బాలుడి ప్రాణ రక్షణ కోసం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని సౌమ్య హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు (సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌) డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా ఈ రూ.3 లక్షల చెక్కును బాలుడి తండ్రి అమీర్‌ బాషాకు మంగళవారం అందజేశారు. తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి ఇంతటి ఉదారత చాటుకున్న కిన్నెర ట్రస్ట్‌ నిర్వాహకులకు, డాక్టర్‌ సింహాద్రికి ఆ తండ్రి కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్‌ విజయవంతం కావడానికి ఇంకా పెద్ద ఎత్తున నిధులు అవసరమున్నందున, బిడ్డను కాపాడటానికి దాతలు ఉదారంగా స్పందించి సహాయం చేయాలని తల్లిదండ్రులు చేతులు జోడించి దీనంగా వేడుకుంటున్నారు

పసి ప్రాణాన్ని కాపాడుకుందాం..మీ విరాళాలు పంపండి

బాలుడి శస్త్రచికిత్సకు సహాయం చేసి ఆదుకోవాలనే సహృదయం గల దాతలు నేరుగా బాలుడి తల్లి బ్యాంక్‌ ఖాతాకు లేదా ఫోన్‌ నెంబర్‌కు విరాళాలు పంపవచ్చు బ్యాంక్‌ ఖాతాదారు పేరు: నూర్జహాన్‌ (బాలుడి తల్లి), బ్యాంక్‌ పేరు: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అకౌంట్‌ నంబర్‌: 104010100200315, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌: UBIN0810401కు తమ విరాళాలు పంపగలరని మనవి చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలసుకోదలచినవారు 8328262592 నంబరులో సంప్రదించవచ్చు.

తలసేమియాతోమైదుకూరు బాలుడి పోరాటం

బోన్‌ మ్యారో మార్పిడికి 15 లక్షల ఖర్చు

‘కిన్నెర ట్రస్ట్‌’ రూపంలో రూ.3 లక్షల తోడ్పాటు

హైదరాబాద్‌ లోటస్‌ ఆస్పత్రిలోప్రిపరేషన్‌ చికిత్స

చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు చేతులు చాచిన తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement