కేవీపల్లె : ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కొత్తపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కొత్తపల్లెలో నివాసం ఉంటున్న రమణమ్మ కుమార్తె శాలిని (15) కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు.
విద్యుత్ మోటారు వైరు చోరీ
రొంపిచెర్ల : వ్యవసాయ పొలంలోని విద్యుత్ మోటారు వైరు చోరీకి గురైనట్లు బి.వి.కృష్ణారెడ్డి రొంపిచెర్ల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ పరిధి ప్రేమనగర్ సమీపంలోని మామిడి తోటలో బోరు వేసుకుని చెట్లను పెంచుకుంటున్నారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 150 మీటర్ల విద్యుత్ వైరు చోరీ చేశారు. దీని విలువ సుమారు రూ.33 వేలు ఉంటుంది. 20 రోజుల క్రితం కూడా విద్యుత్ వైరు చోరీకి గురైంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని బి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. అలాగే మండలంలో అక్కడక్కడా విద్యుత్ వైర్లు చోరీకి గురి అవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. పోలీసులు నిఘా పెంచాలని వారు కోరారు.
ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఆటో
యువకుడి మృతి
సుండుపల్లె : వానరాచపల్లె బిడికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. సుండుపల్లె సానిపాయి మార్గంలో సుండుపల్లె నుంచి సానిపాయి వైపు వెళ్తున్న పీలేరు–రాజంపేట ఆర్టీసీ బస్సు, ప్రయాణికులతో ఎదురుగా వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బుక్కే ఆదికేశవ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆదికేశవ నాయక్ (18) మృతి చెందినట్లు సమీప బంధువులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో
నలుగురికి గాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె– బెంగళూరు రోడ్డులోని సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఘటనపై తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మండలంలోని పొన్నేటి పాలెం పంచాయతీ చిప్పిలికి చెందిన రాజశేఖర్(25), భాను ప్రకాష్(24) భాను(26), నాని అలియాస్ రాహుల్(23) కర్ణాటకలోని రాయల్పాడుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బైకుపై మదనపల్లికి బయలుదేరారు. మార్గంమధ్యంలో ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని అదుపు తప్పి ఢీకొని నలుగురూ గాయపడ్డారు. వారిని అదే బొలెరో వాహనంలో స్థానికులు చికిత్స కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


