● పాత కమిటీని నిలదీసిన కొత్త పాలకవర్గం
● నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అధికారులదే
మదనపల్లి టౌన్ : అన్నమయ్య జిల్లాలో రూ.30 కోట్ల విలువైన దేవుడి మాన్యం భూముల కబ్జా వ్యవహారం సంచలనంగా మారింది. ‘కొట్టేసిన చెట్ల చాటున.. కోట్ల గుట్టు’ అంటూ సాక్షి దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురితం కావడం పాఠకులకు తెలిసిందే. దేవదాయ శాఖకు చెందిన ఆలయ భూములు కబ్జాకు గురి కావడంతో ఆలయ పాత, ప్రస్తుత పాలకవర్గాల మధ్య వివాదం భగ్గుమంది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె మండలంలోని సీటీఎం ఆంజనేయస్వామి, శ్రీ నల వీరగంగా భావానీ ఆలయానికి చెందిన 7.50 ఎకరాల మాన్యం భూమిని గత పాలకవర్గ హయాంలోనే కబ్జా చేశారని విచారణలో తేలింది. అప్పటి పాలకవర్గంలోని టీడీపీ నాయకులు, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి అనుమతి పత్రాలు ఇవ్వడంతోనే.. డాక రాజుగారి రాజప్ప పట్టాభి, కుమారుడు రెడ్డి రాంప్రసాద్, లీలావతమ్మ, రఘునాథ్‌లు కలిసి మిల్లు కార్మికుడు నారాయణస్వామికి ఆంజనేయస్వామికి చెందిన దేవదాయ శాఖ భూమిని రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకున్నారని కమిటీ విచారణలో బయటపడింది.
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ సైతం దర్యాప్తులో భూములు కబ్జాకు గురయ్యాయని నిర్ధారించారు. ఆ తర్వాత ఆ భూమి పలువురి చేతులు మారి అమ్మకాలు, అక్రమ నిర్మాణాలు, తోటల పెంపకం జరిగిందని ప్రస్తుత చైర్మన్ ఆనంద పార్థసారథి.. పాత కమిటీని నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు ఎంత భూమి కబ్జా చేసి అమ్మారో, అక్రమ కట్టడాలు ఎవరు చేపట్టారో తేల్చుతామని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు 30 కోట్ల దేవదాయ భూముల కబ్జాపై నిగ్గు తేల్చాల్సి ఉంది.


