వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతిపై విచారణ

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

పీలేరు : స్థానిక ఎస్‌కేఆర్‌ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై అందిన ఫిర్యాదుతో డీఎంహెచ్‌వో శ్రీనివాసులు నేతృత్వంలో మంగళవారం విచారణ చేపట్టారు. గత నెల 26న కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ జాండ్రపేటకు చెందిన కె.సురేంద్ర(42) కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైదం కోసం పీలేరు పట్టణంలోని ఎస్‌కేఆర్‌ హాస్పిటల్‌లో చేరాడు. 27వ తేదీ ఆయనకు ఆపరేషన్‌ చేయడానికి ముందు మత్తు మందు ఇచ్చారు. అయితే మత్తుమందు ఇచ్చిన కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సురేంద్ర పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్‌ యాజమాన్యం హుటాహుటిన వారి అంబులెన్స్‌లోనే తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పలు ప్రజా సంఘాల నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌కేఆర్‌ హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యంతో సురేంద్ర మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం డీఎంహెచ్‌వో బృందం ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఆస్పత్రి సిబ్బందితో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. స్విమ్స్‌ ఆస్పత్రి రిపోర్టు ఆధారంగా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విచారణ బృందం డాక్టర్‌లు రమేష్‌బాబు, శశికుమార్‌రాజు, ఉదయ్‌కిరణ్‌, రాజశేఖర్‌, శ్రీధర్‌, రాజగోపాల్‌, చంద్రశేఖర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement