మదనపల్లి టౌన్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ’పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, దొంగతనాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల వేళ అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘా పెంచామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు తెలియజేశారు.


