చౌడేపల్లె : మండలంలోని దిగువపల్లెలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతోపాటు అధిక సంఖ్యలో విద్యార్థులు,యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. క్యూలెన్లలో భక్తుల రద్దీతో తోపులాటలు జరిగాయి. కనీస వసతులు లేక వృద్దులు, చిన్న బిడ్డల తల్లులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మల్లయ్యకొండకు
ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6.00, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
నేడు ’డయల్ యువర్
సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగష్టు 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ..
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్‌ఈ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 94408 17449కు, కడప జిల్లా వినియోగదారులు 08562242457కు కాల్ చేయాలని సూచించారు.
సీఎం సభకు బస్సులు..
ప్రయాణికులకు తిప్పలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం పర్యటన సందర్భంగా కడప రీజియన్ నుంచి 80 బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం బస్సులన్నీ సీఎం సభకు వెళ్లడంతో కడప బస్టాండ్‌లో ప్రయాణికులు బస్సుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొర బస్సులతో ప్రయాణికులు నిలబడి ప్రయాణం సాగించారు. ఒక్కో బస్సు వస్తే వంద నుంచి 120 వరకు ప్రయాణికులను ఎక్కించుకుని రద్దీగా వెళ్లాయి. కాగా కడప, ప్రొద్దుటూరు, పులివెందుల డిపోల నుంచి 15 బస్సుల చొప్పున, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు డిపోల నుంచి 10 బస్సుల చొప్పున, రాజంపేట డిపో నుంచి 8 బస్సుల చొప్పున పంపారు.
పిల్లల వికాసమే
బాలోత్సవ లక్ష్యం
కడప ఎడ్యుకేషన్ : పిల్లల వికాసం, సృజనాత్మక శక్తిని వెలికి తీయడమే బాలోత్సవ లక్ష్యమని కడప బాలోత్సవం జిల్లా అధ్యక్షుడు నాగమునిరెడ్డి అన్నారు. కడప బాలోత్సవం – 4 ఆహ్వాన సంఘం సమావేశం ఆదివారం యస్. వి. ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక దృక్పథపు ఆలోచనలు కెత్తించేందుకు వారి శక్త యుక్తులను ప్రదర్శించేందుకు ఒక మంచి వేదికను తీసుకురావాలని చేసిన ప్రయత్న రూపమే ‘కడప బాలోత్సవం‘అని అన్నారు. యస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు జాతి నిర్మాతలని.. మనం భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం, భవిష్యత్తు సమాజం బాగుకోసం, బాలోత్సవాలను బాధ్యతగా చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ పిల్లలు విద్యావనాల్లో వికసిత కుసుమల్ల పరిమళించాలన్నారు. పిల్లలకు విద్యతోపాటు విద్యాతర కార్యక్రమాలకు అవసరం అన్నారు. కడప బాలోత్సవం గౌరవ సలహాదారులు గుర్రాల గోపాల్ పాల్గొన్నారు.


