ములకలచెరువు: పాలు సేకరించడానికి వెళ్తుండగా పాల ఆటో, ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టుకోవడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని పెద్దపాళ్యం పంచాయతీ మళిగివారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేష్, తన స్నేహితుడైన రాజేష్‌తో కలిసి పాలు సేకరించడానికి ఆటోలో అదే పంచాయతీకి చెందిన గోళ్లవారిపల్లెకు బయల్దేరి వెళ్లారు. మార్గ మద్యం పెద్దపాళ్యం పెద్దేరు బ్రిడ్జి వద్దకు రాగానే సత్యసాయి జిల్లా కదిరి వైపు నుంచి మదనపల్లెకు పెళ్లి బృందంతో వెళ్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఆటో బోల్తాకొట్టింది. ఆటోలోని ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో ములకలచెరువు పీహెచ్‌సీకి తరలింస్తుండగా మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆటో, కారును ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పక్కకు జరిపారు. మృతుల ఇద్దరికీ వివాహం కాలేదు. రాజేష్ ములకలచెరువులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..
మదనపల్లె టౌన్: శుభకార్యానికి వెళ్లి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని తట్టివారిపల్లి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన శ్రీరాములు, నిమ్మనపల్లి మండలం బండ్లపైకి గ్రామానికి చెందిన వంకాయల లక్ష్మీదేవి శనివారం రాత్రి సీటీఎంలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం ఉదయం ముహూర్తం అనంతరం ఇద్దరూ ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యలో కర్ణాటక వైపు నుంచి వచ్చిన కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీరాములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవిని 108 సిబ్బంది మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యుడి మృతి ఆ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
ప్రయాణాల్లో రోడ్డు ప్రమాదాలు.. పలువురికి మృత్యుమార్గాలుగా మారాయి. జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపాయి.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం


