బ్రేకర్ల కథ ముగిసింది | - | Sakshi
Sakshi News home page

బ్రేకర్ల కథ ముగిసింది

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

మదనపల్లె (కురబలకోట): నిన్న మొన్నటి వరకు కొంత దూరం వెళితే స్పీడ్‌ బ్రేక్‌.. మళ్లీ వాహనం వేగం పెంచి వెళ్లేలోగా మరో స్పీడ్‌ బ్రేక్‌..!! ఇలా మదనపల్లి పట్టణ ప్రధాన రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ స్పీడ్‌ బ్రేకులతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. రాత్రి వేళ అయితే సరిగ్గా కనపడక ప్రమాదాలబారిన పడేవారు. ఇబ్బందులు, అవస్థల నుం చి ఒక్కసారిగా నో జర్క్స్‌.. నో బ్రేక్స్‌ పట్టణం మారింది. ప్రయాణికులకు స్పీడ్‌ బ్రేకుల నుంచి విముక్తి లభించడంతో హాయిగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న స్పీడ్‌ బ్రేకులను ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా తొలగించి బ్రేకప్‌ చెప్పారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాలతో డీఎస్పీ బుచ్చి రాజు పర్యవేక్షణలో పట్టణ ట్రాఫిక్‌ ఫోలీస్‌ అధికారులు, ఆర్‌ అండ్‌బీ అధికారుల సంయుక్త పర్యవేక్షణలో రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో వీటిని జేసీబీతో తొలగించినట్లు ట్రాఫిక్‌ సీఐ చాంద్‌ బాషా తెలిపారు.

జిల్లాలో ఎక్కడా లేని విధంగా..

మదనపల్లె పట్టణంలో వేగ నియంత్రణ కోసం నాలుగేళ్ల క్రితం వివిధ ప్రధాన రహదారుల్లో 18 దాకా స్పీడ్‌ బ్రేక్‌లు వేశారు. అయితే జిల్లా కేంద్రం కావడం, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడం, రద్దీ ఎక్కువ కావడంతో ఈ స్పీడ్‌ బ్రేకుల వద్ద స్లోగా వెళ్లాల్సి రావడం కూడా ఒక్కోసారి సమస్యగా మారింది. నిత్యం పట్టణంలో వేలాది మంది వివిధ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. స్పీడు బ్రేకుల వద్ద ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో కదిరి, పుంగనూరు, సీటీఎం రహదారిలో పట్టణంలో ఉన్న స్పీడ్‌ బ్రేకులను ఒకే రోజు రాత్రి వేళలో తొలగించారు. బెంగళూరు రోడ్డులో ఇదివరకే తొలగించారు. దీంతో మదనపల్లె పట్టణంలో ప్రధాన రహదారుల్లో స్పీడు బ్రేకులు శకం ముగిసినట్లయింది. అంతేకాదు వాటికి శాశ్వితంగా టాటా చెప్పినట్లయ్యింది. స్పీడు బ్రేకులు తొలగించడంతో హాయిగా రాకపోకలు సాగిస్తున్నట్లు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

కుదుపు కష్టాలకు గుడ్‌బై

మదనపల్లెలో స్పీడ్‌ బ్రేకర్ల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement