● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
రామానాయుడు
మదనపల్లె(కురబలకోట): చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల కష్టాలు కన్పించడం లేదని వారిని ఆదుకునేందుకు వెంటనే రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రామానాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందన్నారు.గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా, సహజ వనరుల దోపిడీని అరికట్టడంలో అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. వర్షాభావం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరువు సహాయక చర్యలు చేపట్టడంతోపాటు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలన్నారు. అంతేకాదు కొత్తగా రుణాలు అందజేయాలన్నారు. ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న 22–ఎ నిషేధిత జాబితా భూముల ఇబ్బందులను తొలగించి అర్హులకు సంపూర్ణ హక్కులు కల్పించాలన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానన్న చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలన్నారు. ప్రధానంగా సీమ ప్రాంతానికి జీవనాడులైన హంద్రీనీవా, గాలేరు–నగిరి ప్రాజెక్టులను వెంటనే పూర్తి గావించి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారిగా ఉద్యమాలను ఉదృతం చే స్తామని హెచ్చరించారు. టి. జనార్దన్, జి. మునిరత్నం, శివారెడ్డి, సాంబశివ, మురళి, నరేష్, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


