ప్రొద్దుటూరు క్రైం : వైఎస్సార్‌కడప జిల్లా మైదుకూరు రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖురేషి మహమ్మద్ అస్రార్ (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తిరుమలనాయునిపేటకు చెందిన మహమ్మద్ అస్రార్ మటన్ షాపులో పని చేస్తున్నాడు. అతను తన బంధువైన ఖురేషి ముజాహిద్‌తో కలసి పొట్టేళ్లు కొనుగోలు చేసేందుకు శనివారం రాత్రి బైక్‌లో మైదుకూరులో నిర్వహిస్తున్న సంతకు బయలుదేరారు. ఖురేషి ముజాహిద్ బైక్ నడుపుతుండగా మహమ్మద్ అస్రార్ వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు ఆర్టీసి బస్టాండు వద్దకు వెళ్లగానే ఎదురుగా రోడ్డు దాటుకుంటున్న బాబాఫకృద్ధిన్, షేక్ అలీ ముర్తుజాలను వారి బైక్ ఢీ కొంది. దీంతో బైక్‌లో వెళ్తున్న మహమ్మద్ అస్రార్, ముజాహిద్‌లు ఎగిరి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన మహమ్మద్ అస్రార్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత మృతి చెందాడు. బైక్ నడుపుతున్న ఖురేషి ముజాహిద్‌తో పాటు నడుచుకుంటూ వెళ్తున్న బాబాఫకృద్ధిన్, షేక్ అలీ ముర్తుజాలు గాయపడ్డారు. బాబాఫకృద్ధిన్ ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న లాడ్జీలో రూమ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. గాయపడిన ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


