మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ –2026) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం మదనపల్లె కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులను నియమించామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో బూత్ స్థాయి అధికారుల (బిఎల్‌ఓ) ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఒకే కేంద్రానికి చెందిన ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన వారిని జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులైన, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారి వివరాలను గుర్తించనున్నారు. కాల్ సెంటర్ సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఓటర్ల సందేహాలు, అభ్యంతరాల పరిష్కారానికి 08571–293001 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సర్ –2026 ప్రక్రియకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలను ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడి దష్టికి తీసుకెళ్లేందుకు 9193591939 నంబర్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు.


