పీలేరు : రెండు కార్లతో సహా రూ.8.24 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం రాత్రి అటవీ శాఖ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు.. స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలో ఎంజేఆర్ కళాశాల సమీపంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన రెండు కార్లను అటవీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆపకుండా పీలేరు వైపు వెళుతున్న కార్లను అటవీ సిబ్బంది వెంబడించడంతో.. రోడ్డు పక్కన ఆపి దుండగులు పరారయ్యారు. రెండు కార్లతోపాటు తమిళనాడు డ్రైవర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్లను తనిఖీ చేయగా 185 కేజీల బరువు గల 6 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


