● బంగారు నగలు, నగదు మాయం
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం తట్టివారిపల్లె సమీపంలోని టిడ్కో ఇళ్లు 6వ బ్లాక్ ఈ–3లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు జుంకీలు, కమ్మలు, రూ.20 వేల నగదు కనిపించలేదని బాధితురాలు అబ్బు చిన్నక్క తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి.. బీరువాలో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై పక్కింట్లో అద్దెకు ఉంటున్న వారిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోయిన నగలు, నగదు ఇప్పించి, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : స్కూటర్ ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శుక్రవారం రాత్రి గుర్రంకొండలో జరిగింది. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా కాపురం ఉంటున్న పగడాల నాగన్న (65) ఊరిలో జరుగుతున్న వారపు సంతకు వెళ్లాడు. చీకటి పడేదాకా సంత చూసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి నడిచి వస్తుండగా.. మార్గమధ్యంలోని బస్టాండ్ వద్ద బైకు ఢీ కొట్టడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సల అనంతరం అక్కడి నుంచి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంకొండ పోలీసులు తెలిపారు.
ఆటో ఢీకొని ద్విచక్ర
వాహనదారుడి దుర్మరణం
పుంగనూరు : అతివేగంగా వచ్చిన ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని యూఎన్‌ఆర్ సర్కిల్ వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బైపల్లెకి చెందిన కె.సుధాకర్(35) పట్టణంలో పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు
కడప సెవెన్‌రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ లెవెల్ అధికారులతోపాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవసరమైన ఫారం–6, అభ్యంతరాలకు సంబంధించి ఫారం–7, సవరణలు, మార్పులకు సంబంధించిన ఫారం–8లు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. జిల్లాలో 3,07,000 మంది మ్యాపింగ్ కానివారు, పేర్లు తప్పులు దొర్లిన వారు ఉన్నారు. వీరందరికీ అధికారులు ఇప్పటికే నోటీసులు జనరేట్ చేసి పంపించారు. ఇందులో 64 వేల మంది మ్యాపింగ్ కానివారు ఉండగా, 2,43,000 మంది తప్పులు దొర్లిన వారు ఉన్నారు. మొత్తం మీద ఇప్పటివరకు 1,16,000 మందికి హియరింగ్ నిర్వహించారు. సెప్టెంబరు 28వ తేదికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. అక్టోబరు 3వ తేదీ ఓటర్లతుది జాబితా వెలువడనుంది.


