కమలాపురం : టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, భయపెడితే వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడే రకం కాదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి సురేష్‌ను పుత్తా వర్గీయులు కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి చితక్కొట్టారు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు వీధిలో జరుగుతున్న కోదండ రామాలయ నిర్మాణ పనుల వద్ద ఉన్న సురేష్‌ను పుత్తా అనుచరులు బలవంతంగా, చొక్కా పట్టుకుని, లాక్కొని ఆటోలో వేసుకుని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నరేన్ రామాంజులరెడ్డి అక్కడికి వెళ్లడంతో.. అంబటి సురేష్‌ను వదిలి పెట్టారు. అంబటి సురేష్ నివాసానికి నరేన్‌రెడ్డి చేరుకుని పరామర్శించారు. భయపడవద్దని, మీ వెంట పార్టీ, నేను, పార్టీ శ్రేణులు నిత్యం అండగా, అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. మీ శ్రేయస్సు కోసం దేనికై నా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నరేన్‌రెడ్డి మాట్లాడుతూ పుత్తా దౌర్జన్యాలను ప్రతిఘటించే రోజులు దగ్గర పడ్డాయని, ఎవరినైనా సరే ప్రతిఘటించి తీరుతామన్నారు. భయపెడితే ఓట్లు వస్తాయనుకోవడం మీ మూర్ఖత్వం అన్నారు. వయస్సులో పెద్దవారు... ఇలాంటి వారిని, అమాయకులను పట్టుకుని కొట్టడమా.. ఇది హాస్యాస్పదం... సరైనోళ్లతో తగలాలని పుత్తాకు హితవు పలికారు. ఇలాంటి దాడులు ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారన్నారు. ఆర్‌ఓబీ బాధితులు 130 మంది ఉంటే ఒక్కడిని పట్టుకుని ఈడ్చుకుంటూ, లాక్కెళ్లి, పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లి దాడి చేయడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్‌సీపీలో అంబటి సురేష్ క్రీయాశీలకంగా ఉన్నారని, ఆయనను మాత్రమే టార్గెట్ చేశారని, అంత మందిలో ఆర్యవైశ్యుడైన సురేష్ ఒక్కరే దొరికాడా? అని ప్రశ్నించారు. ఆర్‌ఓబీ నిర్మాణంలో భాగంగా తమకు నష్ట పరిహారం ఇస్తే తాము మార్కింగ్ వరకు తొలగించుకుంటామంటే పట్టించుకోకుండా ఇలాంటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు ఇదే పనికి నాలుగు సార్లు ధరలు సవరణ చేశారని, దాని ప్రకారమే పరిహారం ఇచ్చి పనులు చేసుకోవాలని బాధితులు చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. సురేష్‌కు జరిగింది చాలా అవమానం అని, దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు.
నన్ను టార్గెట్ చేసి దాడి
బాధితుడు అంబటి సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో తాను చురుగ్గా పని చేస్తున్నాననే కోపంతో పుత్తా అనుచరులు తనపై దాడి చేశారన్నారు. రామాలయం దగ్గర ఉంటే మెడ పట్టుకుని ఆటోలో ఎక్కించుకుని ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఓబీ బాధితులు 130 మంది ఉంటే నన్ను ఒక్కడినే పిలిచి దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ నరేన్‌రెడ్డి బాధితులను పరామర్శిస్తుంటే తాను వెంట ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. తనను అనవసరంగా చితక బాదారని వాపోయారు. పుత్తా అనుచరులు పార్టీ కార్యాలయంలో వేసి తనను చితక్కొట్టారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, చెన్న కేశవరెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, గఫార్, ఇస్మాయిల్, దేవదానం పాల్గొన్నారు.
ఆర్‌ఓబీ భూ బాధితుడిని
కొట్టడం దారుణం
ప్రతిఘటించే రోజులు దగ్గర పడ్డాయి
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ
ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి


